కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్

కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడింది. ప్రాజెక్ట్ లో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో.. మొదటి మోటర్ వెట్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో సెక్రటరీ స్మితాసబర్వాల్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి  ప్రత్యేక పూజలు చేసి.. స్విచ్ఛాన్ చేసి ప్రారంభించారు. నందిమేడారం సర్జ్ పూల్ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఇక్కడి నుంచి ఈ నీళ్లన్నీ నందిమేడారం  రిజర్వాయర్ కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్ సర్జ్ పూల్ కు, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరుకు నీళ్లు చేరున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-6లో ఈ నెల 17 నుంచి ట్రయల్ రన్ కొనసాగింది. వారం రోజులుగా సర్జిపూల్ ను దశల వారీగా నింపుతూ లీకేజీలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఎల్లంపల్లిలో ఉన్న ఎనిమిది పాయింట్ 46 టీఎంసీల నీటిలో జీరో పాయింట్ 25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు.  ఎల్లంపల్లి నుంచి ప్యాకేజీ-6లోని సర్జ్ పూల్ ను పూర్తిగా నింపి లీకేజీలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేకపోవటంతో ఇవాళ మోటార్ల వెట్ రన్ ప్రారంభించారు.

నందిమేడారం ఎత్తిపోతల్లో మొత్తం ఏడు పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు ట్రయల్ రన్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో ఒక్కో మోటర్ సామర్థ్యం 124.7 మెగావాట్లు. అయితే ఒక పంపు రోజుకు 3 వేల 2 వందల క్యూసెక్కులను ఎత్తిపోయనుంది. లింక్-2లో ఇప్పటికే పూర్తయిన పనులతో వచ్చే వర్షాకాలంలో గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్ చేరుకోనున్నాయి. జీరో పాయింట్ 78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయాన్ని కూడా సిద్ధం చేస్తారు.