కాళేశ్వరం రిపోర్ట్ రెడీ 400 పేజీలతో నివేదిక.. ఇప్పటికే 90 శాతం పూర్తి

కాళేశ్వరం రిపోర్ట్ రెడీ 400 పేజీలతో నివేదిక.. ఇప్పటికే 90 శాతం పూర్తి
  • మే రెండో వారంలో ప్రభుత్వానికి అందజేత 
  • ఆ తర్వాత కేసీఆర్‌‌కు నోటీసులు ఇచ్చే చాన్స్ 
  • హరీశ్‌రావు, ఈటలను కూడా పిలిచే అవకాశం

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ఏర్పాటు చేసిన కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​రిపోర్టు దాదాపు పూర్తయింది. కమిషన్ 400 పేజీలతో రిపోర్టును తయారు చేస్తుండగా, అందులో ఇప్పటికే 90 శాతం పూర్తయినట్టు తెలిసింది. ప్రస్తుతం రిపోర్టు తయారీపైనే దృష్టిపెట్టిన కమిషన్..​ మే రెండో వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా కసరత్తు చేస్తున్నది. రిపోర్టు పూర్తయ్యాక అదే వారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కమిషన్​నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇంజనీర్లు, ఐఏఎస్​అధికారులు, కాంట్రాక్ట్​సంస్థలు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా రిపోర్టులో వివరాలను పొందుపరిచి.. అందుకు అనుగుణంగా కేసీఆర్​స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్​తీసుకోవాలని కమిషన్ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సహా పలువురు ప్రముఖుల కేసులనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్​ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన ఇద్దరు మాజీ మంత్రులు హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్​జడ్జి జస్టిస్​పీసీ ఘోష్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ప్రభుత్వం జ్యుడీషియల్​కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే నాలుగు సార్లు కమిషన్​గడువును పొడిగించింది. ఈ నెల 30తో కమిషన్​ గడువు ముగియనుండడంతో మరోసారి పెంచనుంది. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని కమిషన్​ భావిస్తున్నట్టు తెలిసింది.
  
విజిలెన్స్ రిపోర్టు విశ్లేషణ.. 

రిపోర్టు తయారీ కోసం ఇంజనీర్లు, ఐఏఎస్​అధికారుల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలపై కాళేశ్వరం కమిషన్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా ఇప్పటికే ఈ విషయంలో కమిషన్‌‌‌‌‌‌‌‌కు విజిలెన్స్​డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్​సమర్పించిన నివేదికనూ చైర్మన్​జస్టిస్​పీసీ ఘోష్​పరిశీలిస్తున్నట్టు సమాచారం. విజిలెన్స్​ రిపోర్టుకు సంబంధించి ఆరు పుస్తకాల అనెగ్జర్లలోని అంశాలను లోతుగా పరిశీలించి కమిషన్​రిపోర్టులో కొన్ని విషయాలనూ పొందుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఫైనల్​రిపోర్టు కోసం కూడా కమిషన్​ వేచి చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే రిపోర్టు కోసం ఎన్డీఎస్ఏకు లేఖ రాసినట్టు సమాచారం.  

అసెంబ్లీలో రిపోర్టు.. 

కమిషన్​సమర్పించే ఫైనల్ రిపోర్టులో ఏముంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. విజిలెన్స్​రిపోర్టులో ఇప్పటికే 39 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. మరి కాళేశ్వరం కమిషన్​ఎంతమందిపై ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తుందన్న దానిపై ఇటు అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది. ఎలాంటి అంశాలతో రిపోర్టును రూపొందించినా ప్రజలకు తెలిసేలా కచ్చితంగా అసెంబ్లీలో ప్రవేశపెడ్తారని భావిస్తున్నారు. జ్యుడీషియల్​కమిషన్లు ఇచ్చే రిపోర్టులు ఏవైనా అసెంబ్లీలో పెట్టి చర్చించాకే ముందుకు వెళ్లడం రాష్ట్రంలో సంప్రదాయంగా కొనసాగుతోందని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్ చెబుతున్నారు.