
- భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో 35 కోట్లతో అభివృద్ధి పనులు
- యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద మే 15 నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలో మంగళవారం పుష్కరాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ ను మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వచ్చే నెల 15న ప్రారంభమై 26వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయన్నారు.
ఈ పుష్కరాలకు రోజుకు 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సుమారు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అలాగే, పుష్కర ఘాట్‌వద్ద 17 అడుగుల రాతి సరస్వతీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. పుష్కరాల సమగ్ర వివరాలు వెబ్ సైట్, యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వారు చెప్పారు.
అయితే, ఉత్తర భారతంలో ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు తెలిపారు. పవిత్ర సరస్వతీ పుష్కర స్నానం చేసిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ధార్మిక పరిషత్ అడ్వైజర్ గోవింద హరి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.