- అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి..రివాల్వర్‌తో బెదిరించి దారుణం
- ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా
- కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఘటన
- 18న ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
- ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎస్పీ
- ఆరోపణలు నిజమని తేలడంతోఎస్సై భవానీ సేన్ అరెస్టు
- ఈ ఘటనపై సీఎం సీరియస్.. సర్వీస్ నుంచి ఎస్సై డిస్మిస్
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్‌పూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. చట్టాన్ని రక్షించాల్సిన ఎస్సై మృగంలా మారి.. తన పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకుని, అర్ధరాత్రి వేళ కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి, సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి రేప్ చేశాడు. దీనిపై తన భర్త సహకారంతో జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఎంక్వైరీ చేపట్టాలని డీఎస్పీని ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్సైని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను భూపాలపల్లి డీఎస్పీ సంజీవరావు బుధవారం వెల్లడించారు.
20 రోజుల కింద లైంగిక దాడి..
భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌ఫూర్ మండలంలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో భవానీ సేన్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఇదే స్టేషన్ లో ఓ మహిళ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఇక్కడి ఓల్డ్ పోలీస్ స్టేషన్ ను క్వార్టర్స్ గా మార్చగా.. అందులో పైఅంతస్తులో ఎస్సై క్వార్టర్స్, కింది అంతస్తులో మహిళా హెడ్ కానిస్టేబుల్ క్వార్టర్స్ ఉంది. ఈ నెల 15న లేడీ హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ ముగించుకుని రాత్రి 10 గంటలకు తన క్వార్టర్స్ కు వచ్చి నిద్రపోయింది. అయితే ఆమె ఒంటరిగా ఉన్నదని తెలుసుకున్న ఎస్సై భవానీ సేన్.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కిటికీలో నుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. లేడీ హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె నిద్ర నుంచి మేల్కొని ప్రతిఘటించింది. అయినా ఎస్సై వినకుండా తన సర్వీస్ రివాల్వర్ తో తలపై గురిపెట్టి చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బయట చెబితే తీవ్ర పరిమాణాలు ఉంటాయని బాధితురాలిని హెచ్చరించాడు. ఈ ఘటన జరగడానికి 20 రోజుల ముందు బాధితురాలిపై ఎస్సై లైంగిక దాడి కూడా చేశాడు. ఓ రోజు రాత్రి మహిళా హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి కాలు స్లీప్ అయ్యి పడ్డానని, గాయమైందని చెప్పి తన క్వార్టర్స్ కు పిలిచాడు. ఆమె పైఅంతస్తులోని ఆయన క్వార్టర్స్ కు వెళ్లగా లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె వెంటనే అతన్ని నెట్టేసి ఇంటికి పరిగెత్తుకుని వెళ్లింది. ఎస్సై దురుద్దేశాన్ని అప్పుడే గమనించిన మహిళా కానిస్టేబుల్.. కాళేశ్వరం గ్రామంలో అద్దె ఇంటి కోసం వెతుకుతున్నది. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది.
తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పిన మహిళా కానిస్టేబుల్.. అతని సాయంతో ఈ నెల 18న జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి డీఎస్పీ సంజీవరావును ఎస్పీ ఆదేశించారు. తాము చేపట్టిన విచారణలో ఎస్సై భవానీ సేన్ పై చేసిన ఆరోపణలు నిజమని తేలిందని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. నిందితుడిపై కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 449, 376 (2))(ఎ) (బి), 324, 506 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి పంపించామని పేర్కొన్నారు. ఎస్సై భవానీ సేన్ ను అరెస్టు చేసి.. అతని దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
సర్వీస్ నుంచి తొలగింపు..
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో ఎస్సై భవానీ సేన్ ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ మల్టీజోన్‒1 ఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో మహిళా హెడ్ కానిస్టేబుల్ పై ఎస్సై భవానీ సేన్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. గతంలో 2022 జులైలోనూ ఓ యువతిపై ఎస్సై భవానీ సేన్ లైంగిక వేధింపులకు పాల్పడంతో రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్సై తన హోదాను అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపైనా లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎస్సై తరచూ లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడుతూ పోలీస్ శాఖ కీర్తి, ప్రతిష్టలను దిగజార్చుతున్నారు. అందుకే కాళేశ్వరం ఎస్సై భవానీసేన్ ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నాం” అని రంగనాథ్ వెల్లడించారు.
మొదటి నుంచి లైంగిక ఆరోపణలు..
భవానీ సేన్ 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా పని చేస్తున్నప్పుడు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతి.. డిపార్ట్మెంట్ పరంగా సాయం కోసం రాగా ఆమెకు మెటీరియల్, బుక్స్ ఇస్తానని భవానీ సేన్ నమ్మించాడు. ఎత్తు, కొలత చూస్తానని ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. తన భార్య లేదని, ఇంటికి రావాలంటూ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆమె పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు రెబ్బెన స్టేషన్ లోనే ఐపీసీ సెక్షన్ 354-డీ కింద భవానీ సేన్ పై కేసు నమోదైంది. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్సైని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆ కేసుపై ఆసిఫాబాద్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ తర్వాత మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ సెకండ్ ఎస్సైగా పని చేసిన సమయంలో కూడా ఆయనపై లైంగిక ఆరోపణలు చాలానే వచ్చాయి.
ఎవరు తప్పు చేసినా ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు
భవానీ సేన్ దురాగతంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంథని జడ్పీహెచ్ఎస్ లో బడిబాట ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ‘‘ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. విధి నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, దురాగతాలకు పాల్పడినా ఉపేక్షించం. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.