కాళేశ్వరంలో ఘనంగా మహాకుంభాభిషేకం

కాళేశ్వరంలో ఘనంగా మహాకుంభాభిషేకం
  • పూర్తయిన మూడు రోజుల వేడుకలు
  • ప్రత్యేక పూజలకు హాజరైన మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌‌‌‌

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/మహదేవపూర్‌‌‌‌, వెలుగు : భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మహా కుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 42 ఏండ్ల తర్వాత కాళేశ్వరంలో మహా కుంభాభిషేకాన్ని జరిపారు. వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ, శృంగేరి పీఠానికి చెందిన తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో కుంభాభిషేకం జరిపించారు. ఆదివారం ఉదయం 10.42 గంటలకు మహా కుంభాభిషేక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఉత్సవాల్లో భాగంగా శత చండీ పారాయణం, సహస్రఘటాభిషేకం వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ నెల 7న ప్రారంభమైన మహాకుంభాభిషేక పూజలు ఆదివారంతో ముగిశాయి.

హాజరైన మంత్రులు

కాళేశ్వరంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేక మహోత్సవానికి మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం రాత్రే కాళేశ్వరం చేరుకొని హరిత హోటల్‌‌‌‌లో బస చేశారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మంత్రి, శ్రీధర్‌‌‌‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరం కాళేశ్వరం వచ్చారు. ఆలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ముందుగా యాగశాలలోని హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు ఆ తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం కుంభాభిషేకంలో పాల్గొన్నారు. వీరికి సచ్చిదానంద సరస్వతి ఆశీర్వచనం చేశారు. వీరి వెంట దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌‌‌‌, కలెక్టర్‌‌‌‌ రాహుల్‌‌‌‌శర్మ, ఎస్పీ కిరణ్‌‌‌‌ ఖరే ఉన్నారు.

లక్షలాదిగా తరలివచ్చిన జనం

కాళేశ్వరంలో జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవాన్ని చూసేందుకు భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ‘జయ జయ శంకర... హర హర శంకర’ నామస్మరణతో కాళేశ్వరం మారుమ్రోగింది.