![కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం...రేపటి నుంచి మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు](https://static.v6velugu.com/uploads/2025/02/kaleshwaram-temple-gears-up-for-mahakumbhabhishekam-after-42-years_H2f7l4gBRZ.jpg)
- 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు
- భారీ సంఖ్యలో హాజరు కానున్న భక్తులు
- అన్ని ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
జయశంకర్ భూపాలపల్లి, మహాదేవ్‌పూర్, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం నుంచి మహా కుంభాభిషేకం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనుంది. ఈనెల 7న మాఘ శుద్ధ దశమి నుంచి 9వ తేదీ మాఘ శుద్ధ ద్వాదశి వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
ఇందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. కాళేశ్వరం టెంపుల్ జీర్ణోద్ధరణ జరిగిన1982లో మహా కుంభాభిషేకం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ వేడుకలు జరగబోతున్నాయి. కార్యక్రమంలో శృంగేరి జగద్గురువులు భారత తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి, తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి పాల్గొంటున్నట్టు ఆలయ ఈవో మహేశ్ తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు రాకుండా..
కాళేశ్వరంలో కుంభాభిషేకం మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. మూడు రోజులు ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ వరకు పరిశుభ్రత పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు రోడ్డుపై గుంతలను పూడ్చివేశారు. పాత దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆఫీసులో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నారు.
మత్స్య శాఖ గోదావరి నది వద్ద 10 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది. మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించనున్నారు. మహాకుంభాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం తరపున పూర్తి చేశామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. దేవాదాయ, పంచాయతీ, విద్యుత్, వైద్య, ఇరిగేషన్, పోలీస్, అగ్నిమాపక, ఆర్టీసీ శాఖల తరపున పనులు చేపట్టామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
బస్సులు పెంచండి
కాళేశ్వరం టెంపుల్‌కి భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్ర సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండగా అధికంగా తరలివస్తున్నారు. దీంతో బస్సులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బస్టాండ్ వద్ద నిత్యం గొడవలు జరుగుతుండ డమే కాకుండా బస్సు సర్వీసులు పెంచాలనే డిమాండ్ ఎక్కువైంది. భూపాలపల్లి డిపో నుంచి 7, వరంగల్‒2, పరకాల డిపోల నుంచి 31 ట్రిప్పులు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి.
కరీంనగర్, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల నుంచి కూడా ఒకటి, రెండు ట్రిప్పులు బస్సులు వస్తుంటాయి. నిత్యం రెండు వేల మంది మహిళలు గ్రూప్ లుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు పెద్దపల్లి, మంథని ద్వారా రావాల్సి ఉంటుంది. ఈ రూట్లో బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. డైరెక్టుగా కాళేశ్వరానికి బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి కాటారం వెళ్లి, అక్కడి నుంచి మంథని టు కరీంనగర్ వెళ్లాల్సి వస్తుంది. ఇలా మూడు బస్సులు మారితే కానీ కరీంనగర్ చేరుకోలేని పరిస్థితి ఉంది. ఈనెల 7 నుంచి కాళేశ్వరంలో మహా కుంభాషేకం జరుగుతుంది. దీంతో బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు.