మోటర్లు మునిగినప్పటి నుంచి కాళేశ్వరం పంప్‌‌హౌస్‌‌ల వద్దకు పోనిస్తలే

  • గుడి వరకే ప్యాకేజీని పరిమితం చేసిన టూరిజం శాఖ
  • మోటార్లు మునిగినప్పటి నుంచి ‌‌ఇదే పరిస్థితి
  • ఇంజనీర్లు, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ సిబ్బందిని తప్ప

వరంగల్ ప్రతినిధి, వెలుగు: ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు టూరిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. నాలుగు నెలల క్రితం గోదావరి వరదలతో ప్రాజెక్టులోని మోటార్లు మునిగినప్పటి నుంచి ఇదే పరిస్థితి. టూర్ షెడ్యూల్‌‌లో పంప్ హౌస్ సందర్శనను క్యాన్సిల్ చేసిన టూరిజం డిపార్ట్‌‌మెంట్ అధికారులు.. కేవలం టెంపుల్ వరకే ప్యాకేజీని పరిమితం చేశారు. టూరిజం కార్పొరేషన్ నుంచి వెళ్లే టూరిస్టులతోపాటు ప్రైవేట్ వెహికల్స్‌‌లో వెళ్లే వారిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు అనుమతించడం లేదు. చివరగా జూన్‌‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా జనం వెళ్తుండటంతో తెలంగాణ టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ అధికారులు గతంలో వన్​ డే ప్యాకేజీని డిజైన్ చేశారు. 

ఇదీ ప్యాకేజీ

హైదరాబాద్‌‌‌‌ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే టూరిస్టులకు వీలుగా ఈ ప్యాకేజీని రూపొందించారు. పెద్దవాళ్లకు ఒక్కరికి రూ.1,850, పిల్లలకు ఒక్కరికి రూ.1,490-గా చార్జీ నిర్ణయించారు. తెల్లవారుజామున 5 గంటలకు సికింద్రాబాద్ యాత్రి నివాస్‌‌‌‌లో బస్ బయల్దేరి.. ఉదయం హనుమకొండ హరిత కాకతీయలో టిఫిన్ చేసి.. రామప్ప మీదుగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నానికి చేరుకునేవారు. తర్వాత స్థానిక హరిత హోటల్‌‌‌‌లో భోజనం చేసి.. తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్‌‌‌‌, కాళేశ్వరం ముక్తీశ్వరాలయ దర్శనాన్ని సాయంత్రానికి పూర్తి చేసుకుని రాత్రి 11 గంటల కల్లా హైదరాబాద్‌‌‌‌కు తీసుకొచ్చేవారు. అయితే ఈ షెడ్యూల్ ఈ ఏడాది జూన్​ నెలాఖరు వరకే అమలైంది. నాలుగు నెలలుగా ఈ ప్యాకేజీని రామప్ప టెంపుల్, కాళేశ్వరం టెంపుల్ సందర్శనకే పరిమితం చేస్తున్నారు.

బందోబస్తు కొనసాగింపు
గోదావరికి పోటెత్తిన వరదలతో జులై 14న అన్నారం(సరస్వతి), కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నీట మునిగాయి. కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో మోటార్లు ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి కాళేశ్వరం పంప్ హౌస్‌‌‌‌ల సందర్శనకు ప్రభుత్వం ఎవరినీ రానివ్వడం లేదు. అప్పట్లో పలువురు రాజకీయ నేతలు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే పంపుహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పరిసరాల్లోనే అడ్డుకుని వెనక్కి పంపేశారు. అక్కడ ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. బందోబస్తు కొనసాగుతోంది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ ప్రతినిధులను తప్పా ఎవరినీ పంపుహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దరిదాపుల్లోకి వెళ్లనివ్వడం లేదు.