- బ్యాక్ వాటర్‌తో పంటలు, ఊర్లు మునుగుతున్నయ్: వివేక్ వెంకటస్వామి
- ఎత్తి పోసింది 168 టీఎంసీలు.. వాడుకున్నది 20 టీఎంసీలే..
- మిగిలిన నీళ్లన్నీ గోదావరి పాల్జేశారు
- రూ.2వేల కోట్లు కరెంట్ బిల్లులకే పోయాయని వ్యాఖ్య
- మంచిర్యాల జిల్లాలో మునిగిన పంటలు, ఇండ్ల పరిశీలన
మంచిర్యాల, వెలుగు : కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని, దీనిపై సీఎం కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చుపెట్టి కమీషన్ల రూపంలో భారీగా దోచుకున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌వాటర్‌తో నాలుగేండ్ల నుంచి మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 45వేల ఎకరాల్లో పంటలు, ఊర్లు మునుగుతున్నాయని అన్నారు. బుధవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌తో కలిసి చెన్నూర్ మండలం సుందరశాల గ్రామాన్ని సందర్శించారు. అదేవిధంగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, రాంనగర్ ముంపు ప్రాంతాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత బీజేపీ జిల్లా ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే రూ.36వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్ట్‌ను రద్దు చేశాడు. రీ డిజైన్ పేరుతో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టాడు. రోజుకు 2టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు 200 టీఎంసీలు, ఐదేండ్లలో వెయ్యి టీఎంసీలు ఎత్తిపోయాలి. కానీ, ఇప్పటి దాకా 168 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. ఇందులో కేవలం 20 టీఎంసీలు వాడుకొని మిగిలిన నీళ్లు మళ్లీ గోదావరిలోకి వదిలేశారు”అని వివేక్ మండిపడ్డారు.
కేటీఆర్‌కు అవార్డు ఎలా ఇచ్చారో అర్థం కాలే..
కరెంట్ బిల్లుకే రూ.2వేల కోట్లకు పైగా ఖర్చు చేశా రని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం ఇంత పనికిరాని ప్రాజెక్ట్ కడితే.. మంత్రి కేటీఆర్‌కు అమెరికాలో అవార్డు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం లేకపోగా.. ఏటా పంటలు, ఇండ్లు మునిగి నష్టపోతున్నారు”అని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు భూములకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. బాధితులకు మరో చోట భూమి ఇవ్వాలని కోరారు. సుందరశాలలోని ఎస్సీ కాలనీ వాసులను వేరే చోటికి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదు
మంచిర్యాల వరద ప్రభావిత కాలనీల్లోని ప్రజల కష్టాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివేక్ మండిపడ్డారు. ముంపు ప్రాంతాల్లో కిరాయిలకు ఎవరూ రాకపోవడంతో ఎక్కడ చూసినా టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్టీఆర్ నగర్‌లోని పేదలను సురక్షిత ప్రాంతానికి తరలించి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోదావరి, రాళ్లవాగులకు కరకట్టలు నిర్మించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మొరపెట్టుకున్న బాధితులు
కాళేశ్వరం ప్రాజెక్టుతో తమకు చుక్కనీళ్లు కూడా రావడం లేదని సుందరశాలలో పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాక్ వాటర్‌తో ఏటా పంటలు మునుగుతున్నాయని, అప్పుల పాలవుతున్నామని వాపోయారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ తమ బాధలు పట్టించుకోవడం లేదని, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో ఇండ్లు ఎందుకు కట్టుకున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అంటున్నారని, కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచే కాలనీలు మునుగుతున్నాయని ఎన్టీఆర్నగర్, రాంనగర్ ప్రజలు తెలిపారు.