కాళేశ్వరం నీరు రాకున్నా రికార్డు స్థాయిలో పంట

కాళేశ్వరం నీరు రాకున్నా రికార్డు స్థాయిలో పంట
  • రైస్​ మిల్లుల్లో రూ.20వేల కోట్ల విలువైన వడ్లు
  • ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
  • హుజూరాబాద్‌  ఏఎంసీ ప్రమాణస్వీకారంలో మంత్రి పొన్నం ప్రభాకర్​

హుజూరాబాద్‌/ శంకరపట్నం, వెలుగు: కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడకుండా రికార్డు స్థాయిలో పంట పండించగలిగామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. కరీంనగర్  జిల్లా హుజూరాబాద్  మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్న చరిత్ర కాంగ్రెస్  ప్రభుత్వాలకే ఉందన్నారు. 

బీఆర్ఎస్​ ప్రభుత్వం తెలంగాణలో కాళేశ్వరం వల్లే పంటలు పండాయని చెప్పుకుందని, కాళేశ్వరం లేకున్నా ఎల్లంపల్లి నుంచి పొదుపుగా నీళ్లు వాడుకొని ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ పంట పండించామని, దీనికి ప్రకృతి కూడా సహకరించిందన్నారు. బీఆర్ఎస్  నేతలు గతంలో వరి వద్దంటే తమ ప్రభుత్వం సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్​ ఇచ్చిందనన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ చేస్తామని, బీఆర్ఎస్​ గతంలో రూ. లక్ష రుణమాఫీ చేయడానికి ఎన్ని దఫాలు పట్టిందో చెప్పాలన్నారు. రైతు భరోసా పక్కాగా ఇస్తామన్నారు. 

సబ్  కమిటీ రిపోర్ట్​ ఇవ్వగానే అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామన్నారు. మహారాష్ట్ర ఫలితాలపై బీఆర్ఎస్​ సంబురాలు చేసుకుంటోందని, వారి సంతోషం బీజేపీ గెలిచినందుకా? కాంగ్రెస్​ ఓడినందుకా? చెప్పాలన్నారు. బీజేపీతో బీఆర్ఎస్  బంధం గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీలాగా ఉందని, బీజేపీకి బీ టీమ్​లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్  ప్రయాణం కల్పిస్తే మహిళలను కించపరిచేలా సోషల్  మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన సర్వే సాఫీగా జరుగుతుందని, తెలంగాణ మోడల్ గా నిలవబోతుందన్నారు. 

 రైతుల ఖాతాల్లో బోనస్  జమ 

ఇచ్చిన మాట ప్రకారం సన్న రకం వడ్లకు బోనస్  చెల్లిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు. శంకరపట్నం మండలం తాడికల్ లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారమే తూకం వేయాలని సూచించారు. కాంగ్రెస్​ నేతలు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బసవయ్య, నాంపల్లి తిరుపతి, గట్టు తిరుపతి, రాజిరెడ్డి, ఏఈవో లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.