హైదరాబాద్, వెలుగు:
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాల్లో చెరువులు నిండాయని, ఇక వద్దన్నా పైనుంచి నీళ్లు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అందిస్తున్న ఉచిత కరెంట్, సాగునీటి సౌకర్యంతో చాలా మంది యువకులు కూడా ఉద్యోగాలు మానేసి వ్యవసాయం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. సెర్ప్ సహకారంతో మహిళా రైతులు ఏర్పాటు చేసుకున్న బేనిషాన్ ఫార్మర్ ప్రొడ్యుసర్ కంపెనీని, సదరం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సమాజంలో కల్తీ లేని వస్తువు కనిపించడం లేదని, చివరికి మటన్, చికెన్ కూడా కల్తీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల్లో కల్తీ నివారణ కోసమే రైతులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిపారు.
సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం
సదరం క్యాంపులకు దివ్యాంగులు పోటెత్తుతుండడంతో డాక్టర్లు సరిగ్గా అసెస్ చేయలేకపోతున్నారని, అందుకే విడతలవారీగా పరీక్షించేందుకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కొత్త విధానంతో ఒకే రోజు టెస్టింగ్ చేయడంతోపాటు సర్టిఫికెట్ జారీ చేస్తారని చెప్పారు. జనవరి ఒకటో తేదీ నుంచి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
రైతులతో కంపెనీ శుభసూచకం: నిరంజన్‌రెడ్డి
రైతులతో కంపెనీ స్థాపించి ముందుకెళ్లడం శుభసూచకమని, బేనిషాన్ కంపెనీ కూరగాయలతోపాటు ఆర్గానిక్ పంటలను, పాలు, మాంసం ఉత్పత్తులను సేకరించి మార్కెటింగ్ చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రైవేట్ రంగంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 50 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.