- ప్రాజెక్టు చేతికొచ్చేదాకా అసలు, మిత్తీలు చెల్లించక తప్పదు
- జ్యుడీషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ వెల్లడి
- తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది
- మహారాష్ట్ర వైపు ముంపు ఉండడంతో మేడిగడ్డకు బ్యారేజీ షిఫ్ట్
- ఫౌండేషన్ కింద ఇసుక కొట్టుకపోవడంతోనే బ్యారేజీ కుంగింది
- క్వాలిటీ కంట్రోల్, ఓఅండ్ఎం నిర్లక్ష్యమూ కారణం కావొచ్చు
- బ్యారేజీ కుంగితే ప్రభుత్వానికి ఏం సంబంధం?
- చూస్కోవాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులదేనన్న రజత్
- నిధుల కోసం సప్లిమెంట్ బడ్జెట్ కేటాయింపులు: ఎస్కే జోషి
- నేడు ఓపెన్ కోర్టు విచారణకు సోమేశ్‌కుమార్, స్మితా సబర్వాల్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయి ఆదాయం జనరేట్ అయ్యేదాకా.. ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందని ఇరిగేషన్ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు, తాగునీటి అవసరాలు, చేపల పెంపకం వంటి వాటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ నిర్వహిస్తున్న ఓపెన్ కోర్టు విచారణకు బుధవారం రజత్‌కుమార్‌తో పాటు రిటైర్డ్ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2015 మార్చిలో అప్పటి సీఎం (కేసీఆర్) అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని, ఆ మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని విచారణలో రజత్ కుమార్ వెల్లడించారు.
2023 జూన్ 23న జీవో
కాళేశ్వరం కార్పొరేషన్ పర్పస్ ఏమిటని కమిషన్ ప్రశ్నించగా.. నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేశారని రజత్ తెలిపారు. అయితే.. రుణాలు, కార్పొరేషన్ అవసరాలను తీర్చేందుకు వనరులు ఎక్కడివని, ఆ రుణాలను ఎవరు కడతారని కమిషన్ ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు రజత్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఇండస్ట్రీల అవసరాలు, తాగునీటి అవసరాలు, చేపల పెంపకం వంటి వాటి ద్వారా ఆదాయం సమకూరుతుందని.. వాటితో ఆ అవసరాలను తీర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
వాటితోనే రుణాలను తీర్చొచ్చని సమాధానమిచ్చారు. ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయి ఆదాయం వచ్చేదాకా ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు మిషన్ భగీరథ, పలు ఇండస్ట్రీలు, రామగుండం ఎన్టీపీసీ వంటి వాటి ద్వారా ఆదాయం జనరేట్ అవుతుందని, దానికి సంబంధించి 2023 జూన్ 23న జీవో కూడా ఇచ్చారని ఆయన వివరించారు.
తుమ్మిడిహెట్టి వద్ద పూర్తిగా ఆపేశారు
తుమ్మడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే వేరే స్థలంలో ప్రాజెక్టును రీడిజైన్ చేశారని రజత్ కుమార్ వెల్లడించారు. తుమ్మిడిహెట్టితో మహారాష్ట్రలో 3 వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుండడం వల్లే మేడిగడ్డకు బ్యారేజీని షిఫ్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదు కదా.. అలాంటప్పుడు ఎందుకు నిల్వ చేశారని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీని కట్టింది నీటిని నిల్వ చేసేందుకు కాదని.. ఓ టైం వరకు నీటిని స్టోర్ చేసి వెంటనే ఎత్తిపోసుకునేందుకు వీలుగా డిజైన్ చేశారని రజత్ స్పష్టం చేశారు.
తాను సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నప్పటికే బ్యారేజీలను ప్రారంభించారన్నారు. అయితే, తాను ఉన్నప్పుడు బ్యారేజీ మూడు వరదలను తట్టుకుని నిలబడిందని చెప్పారు. 2019, 2020, 2022 వరదలనూ తట్టుకుందన్నారు. అయితే, బ్యారేజీ ప్రారంభమయ్యాక తొలిసారి వచ్చిన వరదలకు ముందున్న సీసీ బ్లాకులు డ్యామేజ్ అయ్యాయని, వాటిపై స్టడీ చేసి రిపేర్లు చేయాల్సిందిగా సంబంధిత ప్రాజెక్టు అధికారులకు చెప్పామని వివరించారు. నీటిని విడుదల చేశాక దిగువకు వెళ్లే వరద ప్రవాహ వేగం ఎక్స్పెక్ట్ చేసిన దాని కన్నా ఎక్కువ ఉండడం వల్లే ఆ సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు 200 అప్రూవల్స్
కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 200 వరకు పరిపాలనా అనుమతులు ఇచ్చారని రిటైర్డ్ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అని, 28 ప్యాకేజీలు, 8 లింకులతో కూడిన నెట్వర్క్ అని తెలిపారు. అంత పెద్ద ప్రాజెక్టుకు ఒక్కటే పరిపాలనా అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. పనులను బట్టి వివిధ సమయాల్లో 200 వరకు అనుమతులు ఇచ్చి ఉంటారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎవరు అనుమతులిచ్చారు.. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారా? అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ సబ్ కమిటీ లాంటివేవీ ఏర్పాటు చేయలేదని జోషి చెప్పారు.
నాటి సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని అన్నారు. నాటి సీఎంతో పాటు నాటి మంత్రులు, ఐఏఎస్‌లు, ఇంజనీర్లు, వ్యాప్కోస్ ఎక్స్‌పర్ట్స్‌తో ఆ రివ్యూలు జరిగాయని చెప్పారు. కేబినెట్ కన్నా సీఎం ఎక్కువ కాదని, సీఎం కన్నా కేబినెట్ పెద్దదని జోషి చెప్పుకొచ్చారు. అయితే, సీఎం ఆమోదం లేనిది కేబినెట్లో ఏ విషయాన్నీ చర్చించలేరని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు స్థలాన్ని ఎలా ఎంపిక చేశారని కమిషన్ ప్రశ్నించగా.. వాస్తవానికి గతంలో ప్రాజెక్టులను కట్టే సమయంలో రెవెన్యూ మ్యాపుల ఆధారంగా స్థలాలను గుర్తించేవారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మ్యాప్స్ ఆధారంగా స్థలాన్ని పర్ఫెక్ట్గా ఎంపిక చేయగలుగుతామని తెలిపారు.
హైపవర్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. తాను ఉన్నప్పుడు ఆ కమిటీ లేదని జోషి చెప్పారు. దాని గురించి తనకు తెలియదన్నారు. అయితే, 2015 అక్టోబర్‌లో ఆయన ఇచ్చిన జీవోలో హైపవర్ కమిటీ ప్రస్తావన వచ్చిన విషయాన్ని కమిషన్ గుర్తు చేయగా.. అది కేవలం టెక్నికల్ కమిటీ అని జోషి చెప్పారు. ఐబీఎం కమిటీ అంటే ఏమిటి అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ కమిటీలో ఎస్టిమేట్స్‌ను విశ్లేషిస్తారని చెప్పారు. అధికారులు పంపిన అంచనాలపై రివ్యూ నిర్వహించి ఆమోదం తెలుపుతారని, ప్రతి ప్రాజెక్టుకూ ఐబీఎం కమిటీని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.
నిర్మాణ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల (సబ్ కాంట్రాక్ట్) సాయం తీసుకుని ఉండొచ్చని ఆయన చెప్పారు. డిజైన్ల లోపం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం, గేట్ల ఆపరేషన్లలో లోపం వల్ల మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. నిధుల సమీకరణ కోసమని జోషి చెప్పారు. అయితే, పబ్లిక్ బాండ్స్ ఏమైనా ఇష్యూ చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. పబ్లిక్ బాండ్స్ చాలా క్లిష్టమైనవని, వాటిని ఇష్యూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. వార్షిక బడ్జెట్లోనే నిధుల కేటాయింపులు జరుగుతాయని బదులిచ్చారు. సప్లిమెంట్ బడ్జెట్ కేటాయింపులు జరగలేదా? అని ప్రశ్నించగా.. చేసి ఉండొచ్చన్నారు.
నేడు విచారణకు సోమేశ్, స్మిత
గురువారం కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టుకు రిటైర్డ్ సీఎస్ సోమేశ్ కుమార్, గతంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ హాజరుకానున్నారు. శుక్రవారం కోదండరాం, వెదిరె శ్రీరామ్ ఓపెన్‌కోర్టుకు వస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
మేడిగడ్డ కుంగితే చర్యలేవీ..?
2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే ఎలాంటి చర్యలు తీసుకున్నారని రజత్‌ను జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ కుంగినప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి అప్పుడు ఎలాంటి రిపేర్లు చేయలేకపోయామని ఆయన తెలిపారు. అయితే.. ఇంజనీరింగ్ అధికారులు, స్టేట్ డ్యామ్‌సేఫ్టీ అధికారులతో దానిపై రివ్యూలు నిర్వహించామన్నారు. అప్పటికీ నదిలో నీళ్లుండడం వల్ల కూడా రిపేర్లు చేయలేకపోయామని తెలిపారు. బ్యారేజీ కుంగడానికి అసలు కారణమేంటి అని కమిషన్ ప్రశ్నించగా.. బ్యారేజీ ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగిపోయి ఉండొచ్చని రజత్ బదులిచ్చారు. అయితే.. క్వాలిటీ కంట్రోల్, ఓ అండ్ ఎం నిర్లక్ష్యం వల్ల కూడా బ్యారేజీకి డ్యామేజ్ జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.
డిజైన్లు, ఆపరేషన్స్‌కు సంబంధించి ఏజెన్సీలు ఏవైనా కంప్లైంట్స్ ఇచ్చాయా? అని ప్రశ్నించగా.. డిజైన్లతో ఏజెన్సీలకు సంబంధం లేదని, సీడీవో అధికారులు చూస్తారని స్పష్టం చేశారు. పెద్ద సంస్థ, వాటి టర్నోవర్‌ను బట్టి కాంట్రాక్ట్‌లు ఇస్తారని చెప్పారు. బ్యారేజీ కుంగినప్పుడు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో వాటికి రిపేర్లు చేయాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్ట్ సంస్థపై ఉంటుందన్నారు. సబ్ కాంట్రాక్ట్ సంస్థలకు ఏవైనా పనులను అప్పగించారా? అని ప్రశ్నించగా.. తనకు తెలిసినంత వరకు సబ్ కాంట్రాక్టులను ప్రభుత్వం అప్పగించలేదని, కాంట్రాక్ట్ సంస్థలు ఇచ్చి ఉంటే ఇచ్చి ఉండొచ్చని ఆయన బదులిచ్చారు. ప్రాజెక్టు అధికారులు చెప్తేనే బిల్లుల పేమెంట్లు చేస్తారని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగితే ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుందని రజత్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆపరేషన్స్ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈది అని, వారిదే బాధ్యత అని చెప్పారు. బ్యారేజీలపై ప్రతిరోజూ ప్రభుత్వం రివ్యూలు చేస్తుందా? అని ఆయన అన్నారు. ఓ అండ్ ఎం ఈఎన్సీ ప్రాజెక్టు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ బాధ్యతలు చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వారి వైఫల్యం కూడా ఉందని ఆయన చెప్పారు.