కాళేశ్వరం విచారణలో హరీశ్​ప్రస్తావన

కాళేశ్వరం విచారణలో హరీశ్​ప్రస్తావన
  • మూడు సార్లు ఆయన పేరు చెప్పిన సీఈ
  • వ్యాప్కోస్ కు డీపీఆర్ ఇవ్వాలని హరీశ్ చెప్పారన్న సుధాకర్ రెడ్డి 
  • ప్రశ్నల వర్షం కురిపించిన కమిషన్ 

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ ఇవాళ కూడా కొనసాగింది. ఈ సందర్భంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం. నిన్నటి వరకు కేసీఆర్ పేరు మాత్రమే విచారణ సందర్భంగా పలువురు ఇంజినీర్లు ప్రస్తావించారు. అయితే ఇవాళ  సీఈ సుధాకర్ రెడ్డి  హాజరయ్యారు. తనిఖీలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు సుధాకర్ రెడ్డి అంగీకరించారు. 

డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్ కు డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు వివరించారు. ఈ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరని కమిషన్ ప్రశ్నించగా.. హరీశ్ రావు అంటూ సుధాకర్ సమాధానం ఇచ్చారు. హరీశ్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల ప్రాసెస్ జరిగిందా..? అని అడగ్గా..  అప్పుడు ప్రాసెస్ జరగలేదని ఈసీ సుధాకర్ రెడ్డి బదులిచ్చారు. 

ALSO READ | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్

హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఫీల్డ్ లో జరిగిన టెస్టుల రికార్డులను వ్యాప్కొస్ సంస్థకు  నామినేషన్ పద్ధతిపై ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఎందుకు ఆలస్యమయ్యాయని కమిషన్ ప్రశ్నించింది. అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయని మేడిగడ్డ బ్యారేజీ పైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదని చెప్పారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపులో భాగంగా మంత్రి, ఈఎన్‌సీ సైట్‌ను పరిశీలించి రివైజ్డ్ చెల్లింపులకు ఆదేశించారని సీఈ సమాధానం ఇచ్చారు. 

పనులు  పరిశీలించకుండా ఎవరో వచ్చి చెబితే సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. పనులు పూర్తై యూజ్ చేసుకునే వీలుంటే ఇవ్వొచ్చని అందుకే ఇచ్చామని వివరించారు. కనీసం చెక్ చేయకుండా సర్టిఫికేట్ జారీ చేస్తే ఎలా..? అని కమిషన్ ప్రశ్నించింది.