హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కాఫర్ డ్యామ్ కోసం నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేయబోమని అగ్రిమెంట్లో ఉన్నప్పటికీ ఆ అగ్రిమెంట్‌ను తుంగలో తొక్కి సంస్థకు రూ. 61.21 కోట్లు చెల్లించడమేందని కాళేశ్వరం జ్యుడిషయ్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పేమెంట్లు ఎవరు చేయాలని ఆదేశించారని రామగుండం సీఈ కొట్టె సుధాకర్ రెడ్డిని ప్రశ్నించింది. పలు కారణాలతో సంస్థకు గత సర్కారే చెల్లింపులు చేయాలని ఆదేశించిందని సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఇది నిధులను దారి మళ్లించడం కిందికి రాదా? అని కమిషన్ నిలదీసింది. ఓపెన్ కోర్టు విచారణలో భాగంగా శనివారం సీఈ కొట్టె సుధాకర్ రెడ్డిని జ్యుడీషియల్ కమిషన్ విచారించింది. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి అయిన వ్యయ చెల్లింపులు, నిర్మాణ సంస్థకు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ తదితర అంశాలపై కమిషన్ ప్రశ్నించింది. విచారణ సందర్భంగా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేరును రెండు మూడుసార్లు సీఈ ప్రస్తావించారు.
అదనపు చెల్లింపులతో నష్టమే కదా?
‘‘కాఫర్ డ్యామ్‌కు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని అగ్రిమెంట్లో ఉన్నప్పుడు చెల్లింపులు ఎలా చేశారు..? చెల్లింపులు చేయాలంటూ ఎవరు ఆదేశించారు?’’ అని సీఈ సుధాకర్‌రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ ప్రకారం నాలా లేదా వాగు లేదా డ్రైనేజీల మీదుగా నిర్మించే కాఫర్ డ్యామ్ ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని ఉందని.. కానీ, మేడిగడ్డ విషయంలో అది జీవనది కావడం, భారీ వరదను మళ్లించాల్సి రావడంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్మాణ సంస్థకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. చెల్లింపులు చేయాలని చెప్పిందెవరని ప్రశ్నించగా.. నాటి ప్రభుత్వం నుంచే ఆదేశాలు వచ్చాయని ఆయన అన్నారు.
చెల్లింపులు చేయాలని అప్పటి సీఎం పలు సమావేశాల్లోనూ చెప్పారని, దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్‌లో ఆ విషయం ఉందని వివరించారు. కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపుకు సంబంధించి చెల్లింపులు చేశారన్నారు. అప్పటి మంత్రి హరీశ్ రావు, ఈఎన్సీ జనరల్ సైట్‌ను పరిశీలించి.. ఆ పనులకు ఓకే చెప్పి చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని ఆయన వెల్లడించారు. అదనపు చెల్లింపులతో ప్రభుత్వానికి నష్టమే కదా అని కమిషన్ నిలదీయగా.. నష్టమేనని సీఈ సుధాకర్‌రెడ్డి అన్నారు. సవరించిన అంచనాల్లో కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం నిర్మాణ సంస్థకు ఒరిజినల్ ఒప్పందంలోని నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.61.21 కోట్లు కావాలనే చెల్లించడం ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్టు కాదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందెవరు?
కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటని జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సహకారం అందించేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్‌గా దానిని ఏర్పాటు చేశారని సీఈ సుధాకర్ రెడ్డి చెప్పారు. అయితే, కార్పొరేషన్‌కు ఆస్తులేమీ లేవు కదా.. అప్పులే ఉన్నాయి కదా అని కమిషన్ పేర్కొంది. ఈ కార్పొరేషన్‌ను ఏ శాఖ ఏర్పాటు చేసిందని.. ఏర్పాటు చేయాల్సిందిగా ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. కార్పొరేషన్‌ను ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేయగా.. ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాడు హరీశ్ రావు ఉన్నారని సీఈ చెప్పారు.
బ్యారేజీ ఎస్టిమేట్స్‌ను నాటి ప్రభుత్వమే ఆమోదించిందన్నారు. ఇరిగేషన్ శాఖకు అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌ను 2018లో.. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2ను మేడిగడ్డకు 2021లో, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు 2022లో ఆమోదించారని తెలిపారు. ‘‘బ్యారేజీ సైట్లో డీవాటరింగ్ కోసం అంచనాలను ఏకంగా 49.61 శాతం పెంచారు కదా.. ఎందుకు పెంచారు.. ఉత్తర్వులున్నాయా?’’ అని కమిషన్ ప్రశ్నించింది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 1 వరకు వోగ్ బుక్‌లోని రూల్స్‌కు తగ్గట్టు ఓరల్ ఆదేశాలతోనే చెల్లింపులు చేశారని సీఈ పేర్కొన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2 సమయంలో తాను లేనన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్‌ను వ్యాప్కోస్‌కు ఇవ్వాలని ఎవరు ఆదేశించారంటూ సీఈ కొట్టె సుధాకర్ రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వమే వ్యాప్కోస్‌కు ఆ పనులను అప్పగించిందని ఆయన సమాధానమిచ్చారు. మంత్రి ఆదేశించారా..? ఆ సమయంలో ఇరిగేషన్ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నారని కమిషన్ ప్రశ్నించగా.. అప్పుడు హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని సీఈ వివరించారు. వ్యాప్కోస్‌కు డీపీఆర్ బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలన్న నిర్ణయం ఎవరిదని కమిషన్ నిలదీయగా.. ప్రభుత్వం నుంచే జరిగిందని, నాటి మంత్రే చెప్పారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కటాఫ్ డిజైన్లను ఖరారు చేసే విషయంలో కాంట్రాక్ట్ సంస్థతో సంప్రదింపులు చేయాలంటూ 2017 జనవరి 11న సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ లెటర్ రాశారని పేర్కొన్నారు.
గేట్ ఆపరేషన్ ప్రొటోకాల్ పాటించలేదా..
మేడిగడ్డ విషయంలో గేట్ ఆపరేషన్ ప్రొసీజర్ ఫాలో అయినట్టు లేదని.. దానికి విరుద్ధంగా 0.3 మీటర్ల ఎత్తులేపి నీటిని వదిలారా? అని కమిషన్ ప్రశ్నించింది. తొలుత వరద వేగాన్ని నియంత్రించేందుకు 0.3 మీటర్ల ఎత్తుకు గేట్లను ఎత్తుతారని, కొంత సమయం తర్వాత ఎత్తును పెంచుతూ పోతారని సీఈ కొట్టె సుధాకర్ రెడ్డి తెలిపారు. గేట్ల ఆపరేషన్‌ను నిర్లక్ష్యంగా చేయడం వల్లే అన్నారం బ్యారేజీలో ఆప్రాన్ డ్యామేజయిందా?.. అందుకే సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయా? అని కమిషన్ ప్రశ్నించింది.
గేట్లను తక్కువ ఎత్తు లేపడం వల్ల వరద ప్రవాహ వేగం ఎక్కువై సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయని, ఆప్రాన్ దెబ్బతిన్నదని సీఈ వివరించారు. గేట్లు ఎత్తినప్పుడు దిగువకు వెళ్లే వరద ప్రవాహ వేగాన్ని తగ్గించే (ఎనర్జీ డిసిపేషన్) ఏర్పాట్లు సరిగ్గా లేవని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీస్ మోడల్ స్టడీస్‌లో వెల్లడైందని అన్నారు. నిర్మాణ సంస్థ పనులను ఆలస్యం చేస్తున్నా.. పెనాల్టీ లేకుండానే గడువు ఎందుకు పొడిగించారని సీఈని కమిషన్ ప్రశ్నించింది. సైట్లో కోల్బెడ్ ఉందని తెలిసినా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారా అని కొట్టె సుధాకర్ రెడ్డిని జుడీషియల్ కమిషన్ ప్రశ్నించగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు.
అయితే, జాధవ్‌పూర్ యూనివర్సిటీ, సార్దీప్ ఇంజనీరిం కన్సల్టింగ్ సంస్థలు కలిసి స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చాయి.. ఆ రిపోర్ట్ చదివారా అని సీఈని కమిషన్ ప్రశ్నించింది. దానికి చదివానని సీఈ చెప్పడంతో.. ఆ రిపోర్ట్‌లో కోల్బెడ్ ఉన్నట్లు ఆ రెండు సంస్థలు స్పష్టంగా చెప్పాయని, అలాంటప్పుడు కోల్ బెడ్ లేదని ఎలా అంటారని కమిషన్ ప్రశ్నించింది. అయితే, ఆ వెంటనే.. సీఈ తన సమాధానాన్ని మార్చుకున్నారు. కేవలం ఒకే ఒక్క బోర్‌హోల్ టెస్ట్‌లో 150 మిల్లీమీటర్ల మందంతోనే బొగ్గు ఆనవాళ్లు బటపడ్డాయని తెలిపారు.
పనులు చెక్ చేయడం మీ బాధ్యత కాదా?
మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయ్యాయో లేదో చూడకుండానే నిర్మాణ సంస్థకు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ (ఎస్సీసీ) ఇవ్వడంపై కమిషన్ మండిపడింది. అసలు వాటిని ఎవరు జారీ చేశారని సీఈ కొట్టె సుధాకర్ రెడ్డిని ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీ ఎస్సీసీని అప్పటి ఈఈ బి.వి. రమణా రెడ్డి జారీ చేస్తే.. దానిపై తాను కౌంటర్ సైన్ చేశానని చెప్పారు. కంప్లీషన్ సర్టిఫికెట్ (సీసీ)ను అప్పటి ఈఈ తిరుపతి రావు జారీ చేస్తే.. ఆ తర్వాత ఎస్ఈగా ప్రమోషన్ పొందిన బి.వి. రమణా రెడ్డి సంతకం చేశారని తెలిపారు.
సుందిళ్ల బ్యారేజీకి నాటి ఈఈ ఓంకార్ సింగ్ సీసీని ఇస్తే.. రమణా రెడ్డి సంతకం చేశారని పేర్కొన్నారు. అసలు సబ్‌స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్ అంటే ఏంటి అని కమిషన్ ప్రశ్నించగా.. 90 శాతం పనులు పూర్తయి బ్యారేజీ వాడుకునేందుకు వీలుగా ఉంటే ఎస్సీసీని జారీ చేస్తారని చెప్పారు. ఎస్సీసీని జారీ చేసే ముందు బ్యారేజీ వద్ద పనులు అయ్యాయో లేదో చెక్చేశారా? అందుకు రికార్డులేమైనా ఉన్నాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. రికార్డులేవీ ఉండవని, పనులను కూడా తాను చెక్ చేయలేదని, చేయాల్సిన అవసరం లేదని, నిర్మాణ సంస్థ రిక్వెస్ట్ మేరకు జారీ చేశామని సుధాకర్ రెడ్డి చెప్పారు.
దీనిపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘పనులు జరిగాయో లేదో చెక్ చేయకుండా ఎస్సీసీ ఎలా జారీ చేశారు? నిర్మాణ సంస్థ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవ్వబోమని తిరస్కరించాల్సింది కదా. ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేశారని పనులు జరిగాయో లేదో చెక్ చేయకుండా ఎస్సీసీని జారీ చేస్తారా? పనులను చెక్ చేయాల్సిన బాధ్యత మీపై లేదా.. అది మీ డ్యూటీ కాదా’’ అంటూ మండిపడింది. ఒరిజినల్ అగ్రిమెంట్‌లోని క్లాజ్ 42.2బీ ప్రకారం నిర్మాణ సంస్థకు ఎస్సీసీని జారీ చేయొచ్చంటూ సీఈ సుధాకర్‌రెడ్డి సమాధానం చెప్పారు.