- కమిషన్ ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి
- ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్‌కు ఆస్తుల్లాగా బదలాయిస్తరు
- లోన్ల ఎఫ్డీ వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు
- ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాకే లోన్లు తీసుకుంటమని స్పష్టం
- కార్పొరేషన్ ఏర్పాటు నుంచి బడ్జెట్ కేటాయింపుల్లేవు: సీఏవో పద్మావతి
- వాస్తవదూరంగా కాగ్ రిపోర్టులోని పలు అంశాలు: వర్క్స్ అకౌంట్ డైరెక్టర్
- ఆర్థిక వ్యవహారాలపై అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్
- ఆస్తుల్లేకుండానే బ్యాంకులు రుణాలిచ్చాయా? నిలదీసిన జస్టిస్ఘోష్
హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)కు అప్పులే తప్ప ఆస్తులేమీ లేవని గతంలో కార్పొరేషన్‌కు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏవో)గా పనిచేసిన వెంకట అప్పారావు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే అవి కార్పొరేషన్‌కు ఆస్తుల్లాగా బదలాయిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిని ఎన్టీపీసీ, రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌కు తరలించడం ద్వారా కొంత రెవెన్యూ వస్తున్నదని వివరించారు.
లోన్లను ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకుంటామని, సీఎస్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ ఆదేశాలతోనే రుణాలకు అప్లై చేస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ బోర్డులో చర్చించాక బ్యాంకుల్లో లోన్లకు అప్లై చేస్తామని తెలిపారు. బ్యాంకు లోన్రిలీజ్ అయ్యాక వెంటనే కాంట్రాక్ట్ సంస్థలకు రిలీజ్ చేయకుంటే.. ఆ లోన్ అమౌంట్‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని, దానిపై వచ్చే వడ్డీ, దానితో పాటు కాంట్రాక్ట్ ఇచ్చే సమయంలో డిపాజిట్ చేసే ఈఎండీలపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్‌ను మెయింటెనెన్స్ చేస్తామని, జీతాలూ అందులో నుంచే తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఒక లోన్‌కు సంబంధించి డిస్బర్స్మెంట్ త్వరగా కాకపోవడంతో దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నారు.
ఆ తర్వాత ఆ ఎఫ్డీని డ్రా చేసి కాంట్రాక్ట్ ఏజెన్సీకి చెల్లించామని తెలిపారు. ప్రాజెక్టు ఆర్థిక వ్యవహారాలపై బుధవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ నిర్వహించింది. ఇద్దరు చీఫ్ అకౌంట్స్ఆఫీసర్లు, ఒక వర్క్స్అకౌంట్ డైరెక్టర్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక విచక్షణ, క్రమశిక్షణలో విఫలమవడం వెనక ఉన్నది ఎవరు? అని అధికారులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించారు. ఆస్తులేవీ లేకుండానే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కార్పొరేషన్‌కు లోన్లు ఇచ్చాయా? అని అడిగారు.
అసలు లోన్లు తీసుకోవాలని ఎవరి నుంచి ఆర్డర్స్ వస్తాయి? అని ప్రశ్నించారు. అప్పటి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ నుంచి తనకు ఆదేశాలు వచ్చేవని మాజీ సీఏవో వెంకట అప్పారావు తెలిపారు. ఆ టైంలో నాబార్డ్ నుంచి లోన్లు తీసుకున్నారని చెప్పారు. అయితే, బడ్జెట్అలకేషన్స్పై ప్రశ్నించినప్పుడు ఇద్దరు అధికారులు పొంతన లేని సమాధానం చెప్పారు. బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని ఒక ఆఫీసర్ చెప్తే.. అసలు కేటాయింపులే లేవని మరో ఆఫీసర్ చెప్పడం గమనార్హం.
గవర్నమెంట్ బ్యాంకు గ్యారంటీ ఇస్తది
లోన్ల కోసం అప్లై చేసే సమయంలో ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీలను ఇస్తుందని వెంకట అప్పారావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలతో లోన్లు తీసుకుంటామని, ఆ లోన్ల ద్వారా కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెల్లింపులు చేస్తామని వివరించారు. బిల్లుల చెల్లింపులకు సంబంధించి తొలుత సీఈల నుంచి రిక్వెస్టులు వస్తాయని, వాటిపై చర్చించి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రభుత్వం ఆమోదించాక.. ఉన్నతాధికారుల ఆదేశాలతో బోర్డు మీటింగ్ నిర్వహించి, బిల్లుల చెల్లింపులు చేస్తామని చెప్పారు. అయితే, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి చెక్ పవర్ ఉంటుందని తెలిపారు.
ఏ ఆదాయమూ లేనప్పుడు కార్పొరేషన్ మెయింటెనెన్స్ కోసం లోన్లు తప్ప వేరే దారి లేదని చెప్పారు. కాగా, బడ్జెట్లో ఇప్పటిదాకా కార్పొరేషన్‌కు కేటాయింపులు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. రుణాలు, వాటిపై వడ్డీల చెల్లింపుల కోసం బడ్జెట్లో కేటాయింపులు చేస్తుందని చెప్పారు. కార్పొరేషన్లో ఎంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారని జస్టిస్ఘోష్ ప్రశ్నించగా.. చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రెటరీలు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, ఎండీ, సీఏవోలు మాత్రం డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నారని వివరించారు.
కార్పొరేషన్ ఏర్పడ్డ నాటి నుంచి బడ్జెట్ ఇవ్వలే..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఏనాడూ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని ఈఎన్సీ (జనరల్) ఆఫీస్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి చెప్పారు. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా బడ్జెట్లో కేటాయింపులు శూన్యమని తెలిపారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ కన్నా ముందే లోన్లు తీసుకోవాలని నిర్ణయించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. సీఈలు ఇచ్చే ప్రపోజల్స్, విజ్ఞప్తుల ఆధారంగానే తాము అంచనాలు ప్రిపేర్ చేసి ఈన్సీ ముందు పెడతామన్నారు. కాగ్రిపోర్ట్కు సంబంధించి పలుమార్లు సమావేశాలు నిర్వహించిందని, అందులో ఇరిగేషన్ సెక్రెటరీ సహా ఇరిగేషన్ శాఖ అధికారులంతా పాల్గొన్నారని చెప్పారు. కాగ్ రిపోర్టులోని అంశాలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల బిల్లులను ప్రీ ఆడిట్ చేశామని వర్క్స్ అకౌంట్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ చెప్పారు. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలతో ఏకీభవిస్తారా? అని కమిషన్ప్రశ్నించగా.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాగ్ పరిశీలించిన విషయాలనే రిపోర్ట్‌లో పేర్కొన్నారని, తమ డిపార్ట్మెంట్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అధిక చెల్లింపులపై మాత్రం ఇరిగేషన్ శాఖ రిప్లై ఇస్తుందన్నారు. అయితే, కాగ్ రిపోర్ట్‌లోని ఒకట్రెండు అంశాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, మేడిగడ్డ ఎస్ఈ సర్దార్ ఓంకార్ సింగ్ బుధవారం కూడా విచారణకు హాజరు కాలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, ఈఎన్సీ హరిరాం కూడా విచారణకు గైర్హాజరు అయ్యారు.