- ఇద్దరు నిర్మాణ సంస్థల ప్రతినిధులు సైతం
- పంప్ హౌస్ ల నిర్మాణంపైనా విచారణ
- 16 లోగా అఫిడవిట్లు ఇవ్వాలని ఆదేశం
- వాటిని పరిశీలించాక బాధ్యులకు నోటీసులు
- సాక్ష్యాల నమోదు తర్వాత బహిరంగ విచారణ
- పీసీ ఘోష్ కమిషన్ కు చేరిన కాగ్ రిపోర్ట్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ 14 మంది ఇంజినీర్లు, ఇద్దరు పంప్ హౌస్ నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. వారి నుంచి వివరాలను సేకరించిన కమిషన్.. అన్ని విషయాలను ఈ నెల 16 వరకు అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ఇంజినీర్లు సమర్పించే అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం పలువురికి నోటీసులు ఇచ్చే యోచనలో కమిషన్ ఉంది.
అఫిడవిట్ల పరిశీలన తరువాత పలువురికి నోటీసులను ఇవ్వనుంది. సాక్ష్యాల నమోదు తర్వాత బహిరంగ విచారణ చేపట్టనుంది.ఇదిలా ఉండగా కాళేశ్వరం పై కాగ్ రూపొందించిన నివేదిక ఇవాళ కమిషన్ కు చేరింది. దీంతోపాటు ఎక్స్ పర్ట్స్ కమిటీ రిపోర్టులు కూడా చేరడం గమనార్హం. అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఎవరికి నోటీసులు ఇవ్వాలో నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టేట్ కాగ్ అధికారులను కూడా కమిషన్ విచారణకు పిలువనుందని సమాచారం.
కాళేశ్వరం ప్యాకేజీకి కింద నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటు చేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ చేపటడుతున్నది. బ్యారేజీలతో పాటు పంప్ హౌస్ ల నిర్మాణంపైనా ఎంక్వైరీ చేయాలన్న ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లింక్-1 ప్యాకేజీలో జరిగిన పంప్ హౌస్ ల నిర్మాణంలో భాగస్వామ్యం అయిన అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులు ఇవాళ విచారణకు హాజరయ్యారు.