
పెద్దపల్లి: యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా వెంకటస్వామికి పెద్దపల్లితో 70 ఏండ్ల అనుబంధం ఉంద న్నారు. తొలదశ ఉద్యమంలో కాకాది కీలకపాత్ర ఉందన్నారు. పెన్షన్ స్కీం, రేషన్ సిస్టంను కాకానే అమలు చేశారన్నారు. పేదలకు గుడిసెలు, ఇండ్ల స్థలాలు ఇప్పించారన్నారు. ప్రజల డబ్బును కేసీఆర్, కేటీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగం పెరిగిందన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేవని, నిరుద్యోగులకు కొలువులు ఇవ్వలేదన్నారు. పేదలు, కార్మికుల కోసం పనిచేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన పేరుతో హామీలను నెరవేరుస్తున్నామన్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తిన్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ఫెయిల్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ఉందన్నారు. తనను ఎంపీ గెలిపిస్తే చిన్న కొడుకులాగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. పత్తిపాక రిజర్వాయర్ కోసం పోరాడుతానని ఆయన ప్రకటించారు.