కదలని కాళేశ్వరం కాల్వలు

కదలని కాళేశ్వరం కాల్వలు
  • నిధుల కొరతతో పూర్తికాని ప్యాకేజీ నెంబర్ 27, 28 హై లెవల్ కెనాల్​ పనులు
  • నెరవేరని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీటి లక్ష్యం
  • 14 ఏళ్ల నుంచి తప్పని నిరీక్షణ
  • కొత్త సర్కారు చర్యలు చేపట్టాలంటున్న రైతులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరందించే లక్ష్యంతో 2009 లో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ నెంబర్ 27,28 హై లెవల్ కాల్వల నిర్మాణాల పనులు మూలకుపడ్డాయి. దీంతో ఆశించిన లక్ష్యం నీరుగారుతోంది. నిర్మల్ సెగ్మెంట్​లో 50 వేలు, ముథోల్ సెగ్మెంట్​లో మరో 50 వేలు మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ రెండు హైలెవల్ కాల్వలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిపై ఆధారపడి నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు అప్పట్లో ప్రతిపాదనలు రూపొందించారు. మొదట ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఈ రెండు కాలువల నిర్మాణాలను ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోకి చేర్చారు. 27వ నెంబరు ప్యాకేజీ హై లెవల్ కాలువ నిర్మాణానికి రూ.714 కోట్లు, 28వ నెంబర్ కెనాల్ కోసం రూ.486.67 కోట్లను అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసింది.

మొదటి నుంచి వివాదాస్పదమే..

అయితే, 27వ కాలువ నిర్మాణ పనులు మొదటి నుంచి వివాదాస్పదమయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్​కు బిల్లులు చెల్లించకపోవడం, భూసేకరణ చేసినా పరిహారం సకాలంలో అందించకపోవడం, కొత్తగా భూ సేకరణకు రైతులు నిరాకరించడం లాంటి సమస్యలు ఈ కాలువ పనులపై ప్రభావం చూపాయి. చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో మిగిలిన పనుల కోసం కాంట్రాక్టర్​ను 
నియమించింది. 

అదనంగా 300 ఎకరాల సేకరణ

27వ నెంబర్ హైలెవల్ కాల్వకు సంబంధించిన మిగిలిన పనుల కోసం 298.51 కోట్లను తాజాగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఏడాదిలోపే పనులు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 300 ఎకరాల భూమిని అదనంగా సేకరించనున్నారు. దీనికోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మేడిపల్లి, బోరిగాం, చించోలి బి, నర్సాపూర్ జి గ్రామాల్లో ఈ భూ సేకరణ చేపట్టనున్నారు. 

అలాగే సోన్  మండలంలోని కడ్తాల్ వద్ద మరో పంప్ హౌస్ ను నిర్మించనున్నారు. కడ్తాల్ నుంచి మామడ వరకు 11 కి.మీ. పొడవుతో పైప్​లైన్ నిర్మించనున్నారు. ఈ హైలెవల్ కాలువ పూర్తయితే నిర్మల్ మండలంతోపాటు మామడ, లక్ష్మణచాంద, దిలావర్ పూర్, సారంగాపూర్, నర్సాపూర్ జి, సోన్ మండలాల్లో 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఏర్పడుతుంది. అయితే కెనాల్ పనులపైనే నీలినీడలు కమ్ముకోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

దయనీయంగా 28వ ప్యాకేజీ కెనాల్

ముథోల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన 28వ హైలెవల్ కాల్వ పనులు 48.37 శాతం మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. ఇప్పటివరకు కేవలం 550 ఎకరాల భూమిని మాత్రమే సేకరించగా ఇ౦కా 3,025 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 2020లోపే ఈ కాల్వ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. పనులన్నీ పూర్తి కావాలంటే ఇంకా ఎన్నేళ్లు వేచి చూడాలోనని రైతులు వాపోతున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రతిపాదనలు అంచనాలు తలకిందులయ్యాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీసం కాలువల పనులను పకడ్బందీగా పూర్తిచేసి రైతులకు సాగు నీరు అందించాలని కోరుతున్నారు.