కాళేశ్వరం మోటార్లు స్టార్ట్..కన్నెపల్లి దగ్గర ఆరు, అన్నారం సుందిళ్లలో రెండు ఆన్‌‌‌‌

  • లింక్‌‌‌‌‒2లో ఒక్కో మోటార్‌‌‌‌ నడిపిస్తున్న ఆఫీసర్లు
  • ప్రాణహితలో రోజుకు 27 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు మోటర్లను సోమవారం ఇరిగేషన్ ఆఫీసర్లు స్టార్ట్ చేశారు. కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ దగ్గర ఆరు మోటార్లు, అన్నారం, సుందిళ్ల పంప్‌‌‌‌హౌస్​‌‌లలో రెండు మోటర్ల చొప్పున నడిపిస్తూ నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. లింక్-– -2లో భాగంగా ఎల్లంపల్లి నుంచి కూడా ఒక మోటార్ స్టార్ట్ చేశారు. మూడు రోజుల కింద మహారాష్ట్రలో కురిసిన వానలతో ప్రాణహిత నదిలో వరద పెరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ ఎగువన 27 వేల క్యూసెక్కుల ప్రవాహం గోదావరిలో కలుస్తున్నది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు లిఫ్ట్ చేయాలని కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినట్లుగా ఇరిగేషన్‌‌‌‌ ఈఎన్‌‌‌‌సీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రోజుకు ఆరు మోటార్ల సహాయంతో ఒక టీఎంసీ నీటిని లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నట్లు తెలిపారు. అయితే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్​ల నుంచి మాత్రం అర‌‌ టీఎంసీ లోపే నీళ్లు ఎగువకు పంప్ అవుతున్నాయి. ఇక్కడ కేవలం రెండు మోటార్లను మాత్రమే ఆన్‌‌‌‌ చేయడం వల్ల 5 వేల క్యూసెక్కుల లోపే నీటిని లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నారు. పొద్దు పూట కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ దగ్గర ఫస్ట్‌‌‌‌ ఐదు మోటార్లను మాత్రమే ఆఫీసర్లు స్టార్ట్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత సాయంత్రం ఆరో మోటార్‌‌‌‌ను ఆన్‌‌‌‌ చేశారు. ప్రస్తుతం మొదటి టీఎంసీకి సంబంధించిన ఒకటి నుంచి ఐదు మోటార్లతో పాటు ఆరో మోటార్​ను నడిపిస్తున్నారు. ఒక్కో మోటార్‌‌‌‌  రోజుకు 2,119 క్యూసెక్కుల చొప్పున మొత్తం ఆరు మోటార్ల సహాయంతో 12,714  క్యూసెక్కుల నీటిని అన్నారం బ్యారేజ్‌‌‌‌కు లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు.