కాళేశ్వరం..ఓ గుదిబండే..

కాళేశ్వరం..ఓ గుదిబండే..

కేసీఆర్ మానస పుత్రిక, ఆయనే ఇంజనీరు అవతారమెత్తి జరిపిన మేధో మధన ఫలితం, ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఇంత తక్కువ కాలంలో కట్టిన అతిపెద్ద ‘మెగా’ ప్రాజెక్ట్ గా బి ఆర్ ఎస్ లోని చిన్న, చితక మొదలు, బడా నాయకుల దాకా కీర్తించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజల పాలిట గుదిబండ అయ్యిందా?  కేంద్ర మంత్రులు, కేంద్ర సాగు నీటి విభాగాల అధికార్లు క్యూ కట్టి మరీ పొగడ్తల్లో ముంచెత్తిన ప్రాజెక్టు ప్రజల ఆశలను నిలువునా ముంచే ప్రాజెక్టుగా తయారయిందా? కాగ్ మధ్యంతర నివేదిక అదే సూచిస్తున్నది.

 ప్రాజెక్ట్ డిజైనింగ్ లోనే లోపాలున్నాయి. మల్లన్న సాగర్​ వంటి రిజర్వాయర్​వంటి  నిర్మాణాలు ప్రపంచంలో నిలబడిన దాఖలాలు లేవని ఐక్యరాజ్య సమితి జల వనరుల మాజీ సలహాదారు దివంగత టి.హన్మంతరావు హెచ్చరించినా, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత మొత్తుకున్నా వినకుండా ఆఘ మేఘాల మీద నిర్ణయాలు తీసుకొని డిజైనింగ్, రీడిజైనింగ్ పేరుతో నిర్మించారు. ప్రాజెక్ట్ వ్యయం ఏటికేడు పెంచుతూ అంచనాలకు మించి చేసిన ఖర్చు, కనిపించని ఆదాయం, ముంచుకొచ్చిన చెల్లింపుల భారం వెరసి కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల గుండెలపై గుదిబండే అయ్యింది.

కాళేశ్వరం నీళ్లపై శ్వేతపత్రం ఇవ్వాలె

తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ అంచనా వ్యయం రు. 80,450 కోట్ల నుండి రు.1,52,000 కోట్లు దాటుతుందని కాగ్ అంచనా వేసింది. ఇప్పటికి పనులన్నీ పూర్తి కాలేదని, మొత్తంగా 56 పనులలో కేవలం 12 పనులే పూర్తయినాయని ఇంకా 40 రకాల పనులు పూర్తి కావాల్సి ఉన్నదని, మరో నాలుగు పనులు ప్రారంభించనేలేదని కాగ్ తప్పు పట్టింది. అయినా ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయిందని 2019 లోనే అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఏమూల నీళ్లు కన్పించినా అవి కాళేశ్వరం నీళ్లు అనటం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. 

నిజంగా ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం నీళ్లిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయగల ధైర్యం ప్రభుత్వానికి ఉన్నదా? గత తొమ్మిది ఏండ్లలో సగటున వర్షాలు బాగా పడటంవల్ల శ్రీరామ్ సాగర్ కు చేరిన నీళ్లను కాళేశ్వరం నీళ్లుగా మభ్య పెట్టింది ప్రభుత్వం. పైగా, వరద తీవ్రతను శాస్త్రీయంగా అంచనా వేయక పోవటం వల్ల మేడిగడ్డ పుంపుహౌసులు మునిగి మోటార్లు దెబ్బతిన్నాయి, మరమ్మత్తులకు అన్యాయంగా కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయ్యింది నిజం కాదా? ఈ సమస్య ముందుగానే గుర్తించిన మేము 2018 లోనే ప్రాజెక్ట్ డీపీఆర్ లో పేర్కొన్న అసంబద్ధ, అసమంజసమైన అంశాలు ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నమూ చేసాం.

ప్రజల నెత్తిన భారం 

 ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత తప్పుల తడకో, దాని వల్ల వచ్చే ఆదాయానికి సంబంధించిన అంచనాలూ అంతే కాకి లెక్కలు, వాస్తవ దూరాలు.  ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత 18 .25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడం, 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ (డీపీఆర్ లో 6 లక్షల ఎకరాలు) సాధ్యమౌతుందని ప్రభుత్వం చెప్పింది. నికర వార్షిక ప్రయోజనం రూ. 21, 521 కోట్లు ఉంటుందని, అందులో రూ. 15, 595 కోట్లు రైతులకు అందుతాయని, వార్షిక నిర్వహణ వ్యయం రూ.13,923 కోట్లు ఉంటుందని చెప్పింది. 

మరోవైపు కాగ్ మధ్యంతర నివేదికలో ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రుణాల (ఆరు బ్యాంకులు, మరో తొమ్మిది ఆర్ధిక సంస్థల నుంచి తీసుకున్న ఋణం రూ. 97,449 కోట్లు) అసలు, వడ్డీ చెల్లింపులే ప్రతి ఏటా రూ. 13 వేల కోట్లు, విద్యుత్ చార్జీల రూపంలో రూ. 12, 000 కోట్లు, నిర్వ హణ వ్యయం మరో రూ.270 కోట్లు ఉంటాయని చెప్పుతున్నది. మొత్తంగా ప్రతి ఏటా రు. 25, 000 కోట్ల కనీస ఖర్చు భరించాలి. ఎకరా ఆయకట్టు సాగుకు కాళేశ్వరం ద్వారా అందే నీటికి రూ. 76,000 ఖర్చవుతుందని డీపీఆర్ లెక్కలు చెపుతుంటే, రాబోయే రోజుల్లో ఎకరా సాగుకు రూ.6.4 లక్షల దాకా అవుతుందని కాగ్ చెప్పింది. ఇదంతా ఎదో ఓ రూపంలో ప్రజల నెత్తిన రుద్దేడే కదా!

ప్రజాధనం వృధాపై ప్రజలకు వివరించాలి

కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించిన 2019 నుంచి ఇప్పటి దాక ఎంత ఆయకట్టుకు నీరిచ్చారు, రైతులు ఏయే పంటలు పండించారు, ఎంత ఆదాయం వచ్చిందో ప్రభుత్వం చెప్పలేక పోతున్నది . అంతే కాదు, జంట నగరాలకు, కాల్వల వెంట ఉన్న గ్రామాలకు, పరిశ్రమలకు నీళ్లిచ్చి నందుకు వేల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. గత నాలుగు సంవత్సరాల్లో ఎంత రాబడి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేకపోతున్నది ఎందుకు? ఆదాయం వచ్చిందే లేదు కనుక. ఇప్పటికీ కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. కోటి ఎకరాలకు నీళ్లిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నరు. ఇదంతా ప్రజలను మోసం చేసేందుకు అల్లిన ఓ కట్టుకథ అనిపించట్లేదా? 

డీపీఆర్ లో ఇచ్చిన అవాస్తవాలను ప్రశ్నించే వాళ్ళను తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇచ్చే ప్రక్రియను అడ్డుకునే ద్రోహులుగా చిత్రీకరించే ప్రయ త్నమూ జరిగింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల వారిని కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ దరిదాపుల్లోకి రానీయ కుండా అడ్డుకోవటం ఆక్షేపణీయం కాదా?  కోటి ఎకరాలకు తామే నీరిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకుం టుంటే మరి గత తొమ్మిది సంవత్సరాల్లో రైతులు 8 లక్షల 46 వేల బోర్లు వేసుకోవటాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి? ఇకనైనా ప్రభుత్వం భేషజానికి పోకుండా ఎవరినడిగి ఇంత పెద్ద ఎత్తున ప్రజా ధనం వృధా చేస్తున్నారో, ప్రజలపై ఇంత భారం మోపటానికి నిజమైన కారణాలు ఏమిటో ప్రజల ముందుంచాలి.

డీపీఆర్​ అబద్దాలు​

ప్రాజెక్ట్ ద్వారా ఏ మేరకు రైతులకు మేలు జరుగుతుందో ఎంత అసంబద్ధంగా డీపీఆర్ లో చెప్పారో మీరే చూడండి. ఉదాహరణకు, ప్రాజెక్ట్ కట్టకముందు హెక్టారుకు పది క్వింటాళ్ల వరి పంట పండితే, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 50 క్వింటాళ్ల కు, ఆదా యం 3,264 రూపాయల నుండి 28,006 రూపాయలకు పెరుగుతుందని ఏ ఆధారం తో అంచనా వేసారో ఆ గోదారమ్మకే తెల్వాలె!  ఇక మిర్చి  విషయానికి వస్తే మతిపోయే అం చనాలు వేశారు. ప్రాజెక్ట్ కు ముందు రైతుకు హెక్టారుకు రూ. 12, 000 నికర ఆదాయం వస్తే, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రూ.1,56, 000 కు పెరుగుతుందని చెప్పారు.

 మిర్చి ఉత్పత్తి విషయంలోనూ ఇదే అంచనా, తెలంగాణ ఏర్పడిన సంవత్సరం 2.56 లక్షల టన్నులున్న ఉత్పత్తి,  ప్రాజెక్ట్ పూర్తయిన తర్వా త 4.67 లక్షల టన్నులు అదనంగా పెరిగి మొత్తంగా 7.23 లక్షల టన్నులు అయి తుందని చెప్పినారు. అంటే 300 శాతం అన్నమాట. ఓ 15-‌‌–20 శాతం పెరిగితేనే మార్కెట్ ధరలు పడిపోతూ రైతులు ఆందోళనలకు దిగుతున్న స్థితిలో 300 శాతం పెరిగితే ఇంకెట్ల ఉంటుందో ఊహించండి. ఇంత పంట పండితే రైతు అమ్ముకునేదెట్లా, ఇందుకోసం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహాలు సిద్ధం చేసిందా అంటే తెలియదు. డీపీఆర్ లో దీనికి సంబంధించిన ప్రస్తావనే లేదు. పండించిన పంట అమ్ముకోవటానికి ప్రతి సీజన్లో రైతులు ఎట్లా అగచాట్లు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం.

– డా. మరింగంటి యాదగిరా చార్యులు,రిటైర్డ్​ ప్రొఫెసర్.

– ఎ. వినాయక రెడ్డి రిటైర్డ్​ ప్రొఫెసర్​, కాకతీయ విశ్వవిద్యాలయం