కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్​కు..

  • గోదావరి పక్కనున్న ఊర్లకు కూడా తాగునీళ్లు ఇస్తలే: తరుణ్​చుగ్
  • టీఆర్ఎస్ పాలనను ఖతం చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యిన్రు
  • కేసీఆర్​కు, లూటీ కేబినెట్​కు అల్విదా చెప్పే టైమొచ్చింది..
  • కాంగ్రెస్ పని అయిపోయింది.. బీజేపీలోకి వస్తే గౌరవిస్తం
  • కాగజ్ నగర్ లో ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో కామెంట్స్

ఆసిఫాబాద్, కాగజ్ నగర్, వెలుగు: ప్రాణహిత ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్.. ఈ నీళ్లను తన సెవెన్ స్టార్ ఫామ్ హౌస్ కు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. గోదావరి, ప్రాణహిత నది వెంట ఉన్న ప్రజలకు మాత్రం తాగేందుకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా తరుణ్​చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఓట్లతో గెలిచిన సీఎం కేసీఆర్.. గద్దెనెక్కిన తర్వాత జనాలను పట్టించుకోకుండా రాక్షస పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను ఖతం చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని.. కేసీఆర్ కు అల్విదా చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.

కేసీఆర్​ను గద్దె దింపే ఉద్యమానికి నాంది

రాష్ట్రంలో త్వరలో కమల వికాసం జరుగుతుందని తరుణ్​చుగ్ అన్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు తుఫాను కాదని.. సునామీ అని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘రాష్ట్రంలో అధికారం సాధించేందుకు సంజయ్ నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్తుంది. ఆదివాసీ హక్కుల కోసం నైజాం పాలనకు ఎదురొడ్డి జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన యోధుడు కుమ్రంభీం పురుటిగడ్డ నుంచే కేసీఆర్ ను గద్దె దింపే మహోద్యమానికి నాంది పలుకుతున్నాం” అని  తరుణ్ చుగ్‌ ప్రకటించారు. ఆదివాసీలకు అండగా నిలుస్తున్న బీజేపీపై టీఆర్ఎస్ సర్కారు కేసులు పెడుతోందని, ఈ కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. నిజాం రాజుల ఆలోచనకు ప్రతిరూపంగా కేసీఆర్ సర్కార్‌ వ్యవహరిస్తోందని, తమను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే రెట్టింపు ధైర్యంతో ముందుకెళ్తామని అన్నారు.

పర్సంటేజీల కోసం తండ్లాట

రాష్ట్రంలో చేస్తున్న ప్రతి పనిలో కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్సంటేజీల కోసం తండ్లాడుతున్నారని తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. కారు సర్కారును డ్రైవింగ్ చేసేది వేరే వాళ్లని.. లూటీ క్యాబినెట్​కు టైమ్ దగ్గరపడిందని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ గెలుపు యాత్ర సిర్పూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుందన్నారు. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు కాదని, పదకొండు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రజలకు ఎంతో ముఖ్యమన్న విషయం బీజేపీ గుర్తించిందని, కానీ రీ డిజైనింగ్ పేరిట ఆ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పక్కకు పెట్టారని, దీన్ని సహించబోమన్నారు.

ప్రతి కార్యకర్త ఓ హనుమంతుడే

కేసీఆర్ రావణుడిలా రాక్షస పాలన చేస్తున్నాడని తరుణ్ చుగ్ విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త హనుమంతుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పనైపోయిందని, ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరే వారికి సముచిత స్థానమిచ్చి గౌరవిస్తామని ప్రకటించారు. సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల ఇబ్బందులపై ఎస్పీఎం నెగోషియేషన్ కమిటీ ఆధ్వర్యంలో తరుణ్​చుగ్​కు వినతిపత్రం అందజేశారు. ఓబీసీ జాబితాలో ఆరె కులస్తులను  చేర్చాలంటూ ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.

లాయర్ల హంతకులను సర్కారు కాపాడుతోంది

గోదావరిఖని, కరీంనగర్ సిటీ, వెలుగు: లాయర్ దంపతులను హత్య చేసిన వారిని రాష్ట్ర సర్కార్ కాపాడుతోందని, నిందితులు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తోందని తరుణ్ చుగ్ ఆరోపించారు. సీఎం, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో పోలీసులు సరిగ్గా పని చేయలేకపోతున్నారని.. నేరస్తుల ఆగడాలను అడ్డుకోలేకపోతున్నారని చెప్పారు. రామగుండంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సింగరేణితో సంబంధం లేని కవిత.. యూనియన్ బాసా?

సింగరేణి సంస్థ రాష్ర్ట సర్కారు సొత్తు కాదని, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని తరుణ్ చుగ్ చెప్పారు. శ్రీరాంపూర్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణితో ఎలాంటి సంబంధం లేని కవితను యూనియన్ బాస్​ను చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర సర్కార్​ఇదంతా గమనిస్తోందన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర సంస్థలతో ఎంక్వైరీ చేయిస్తామని, దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.

సంజయ్​ ఇంటికి తరుణ్​చుగ్

సిర్పూర్ కాగజ్ నగర్ సభకు వెళ్తూ.. దారిలో కరీంనగర్ లోని పార్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ ఇంటికి తరుణ్​చుగ్ వెళ్లారు. ఆయనను ఆహ్వానించిన సంజయ్.. శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి ఫొటోను బహుకరించారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామిని ఆత్మీయంగా సత్కరించారు.

ఇవి కూడా చదవండి 

కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ‌‌‌‌

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

కార్డియాక్ అరెస్టా.. ? ఇట్ల బయటపడొచ్చు