మాఫియా గుప్పిట్లో కల్లు దందా..పది రోజుల్లో 3 షాపులపై దాడులు

మాఫియా గుప్పిట్లో కల్లు దందా..పది రోజుల్లో 3 షాపులపై దాడులు
  •     ఆధిపత్యం కోసం పది రోజుల్లో 3 షాపులపై దాడులు
  •     ఇల్లీగల్  షాపులకు గద్వాల ఎక్సైజ్  ఆఫీసర్ల సపోర్ట్
  •     రోడ్డున పడుతున్న కల్లు గీత కార్మికులు

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లాలో కల్లు లాడాయి రాజుకుంటోంది. కల్లు దందాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. గ్రామాల్లోని కల్లు షాపులను తమ ఆధీనంలోకి  తీసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీలకు చెందిన లీడర్లు ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో దాడులు, కల్లు షాపులకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం చేస్తున్నారు. పది రోజుల్లోనే గద్వాల మండలం మేళ్లచెరువు కల్లు షాపునకు నిప్పు పెట్టగా, గద్వాల టౌన్ పరిధిలోని జమ్మిచేడు కల్లు షాప్  ధ్వంసం చేశారు. తాజాగా సంక్రాంతి రోజు నది అగ్రహారం సమీపంలో ఏర్పాటు చేసిన కల్లు డిపోకు నిప్పు పెట్టారు.

ఆధిపత్యం కోసం దాడులు..

పదేండ్లుగా బీఆర్ఎస్  పార్టీకి చెందిన ఒక లీడర్  కనుసన్నల్లోనే కల్లు దందా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు మారడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా కల్లు దందాలోకి అడుగు పెడుతున్నారు. దీంతో గౌడ సామాజిక వర్గం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడున్న షాపులకు అదనంగా గ్రామాల్లో కొత్త షాపులు వెలుస్తున్నాయి. దీంతో కల్లు దందా ఎక్కడ తమ చేతి నుంచి జారిపోతుందనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారని భావిస్తున్నారు. 

కొన్నేండ్లుగా లైసెన్సులే లేవు..

గ్రామాల్లో కల్లు దుకాణాలకు కొన్నేండ్లుగా లైసెన్స్​లే లేవు. మల్దకల్  మండల కేంద్రంతో పాటు అమరవాయి, మద్దెల బండ, బూరెడ్డిపల్లి, జాంపల్లి, అల్లాపాడు గ్రామాల్లో ఇల్లీగల్ గా కల్లు షాపులను నడుపుతున్నారు. జిల్లాలో దాదాపు 200కు పైగా ఇల్లీగల్  షాపులను మాఫియా నడుపుతోంది. ఐదేండ్లకోసారి లైసెన్స్  రెన్యువల్  చేయాల్సి ఉన్నా, ఎక్సైజ్  ఆఫీసర్లు కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి.

గద్వాల టౌన్  సొసైటీకి ఫుల్  సపోర్ట్..

జిల్లా కేంద్రంలోని కల్లు సొసైటీకి ఎక్సైజ్ ఆఫీసర్లు ఫుల్  సపోర్ట్  చేస్తున్నారని గౌడ కార్మికులు ఆరోపిస్తున్నారు. సొసైటీ రద్దు అయినప్పటికీ మాఫియా కల్లు విక్రయాలు జరపడం, ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో గీత కార్మికులు కోర్టుకు వెళ్లారు. లైసెన్స్  లేని కల్లు దుకాణాల ద్వారా అమ్మకాలు జరగకుండా చూడాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదిలాఉంటే సొసైటీపై కేసులు లేవని మొదటి తప్పు కింద రూ. 2 లక్షలు ఫైన్ వేసి గద్వాల ఎక్సైజ్  సూపరింటెండెంట్  పాత కల్లు సొసైటీకి కల్లు అమ్ముకునేలా ఆర్డర్స్  ఇచ్చారు. దీనిని వ్యతిరేకించిన కల్లు గీత కార్మికులు గద్వాల టౌన్  సొసైటీపై 2007, 2014లో  కేసులు ఉన్నాయని, అప్పట్లోనే ఫైన్ లు కట్టారని గీత కార్మికులు మరోసారి కోర్టుకు వెళ్లారు.

దీంతో ఈఎస్  ఇచ్చిన ఆర్డర్స్ పై స్టే విధిస్తూ కౌంటర్  దాఖలు చేయాలని ఆదేశించింది. ఫైన్లు వేసి లైసెన్స్​ రెగ్యులర్  చేసిన వ్యవహారంలో లక్షల్లో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. అలాగే కొందరు ఎక్సైజ్  ఆఫీసర్లకు టౌన్  కల్లు సొసైటీలో వాటాలు ఉన్నట్లు గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇక ఎక్కడి కల్లు అక్కడే అమ్మాలనే రూల్​ ఉన్నా, ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంల ద్వారా ఇతర ప్రాంతాలకు కల్లు సప్లై చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ఈత, తాటి వనాలు లేవు. కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అంటున్నారు. గతంలో కల్లు తాగి చనిపోయిన ఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకున్నాయి.

రోడ్డున పడుతున్న గీత కార్మికులు..

కల్లు గీత వృత్తినే నమ్ముకుని చాలా మంది బతుకుతున్నారు. మాఫియా ఈ ఫీల్డ్  లోకి ఎంట్రీ కావడంతో గీత కార్మికులు పని దొరకక రోడ్డున పడ్డారు. జిల్లాలో 900 కు పైగా సొసైటీలున్నాయి. ఇందులో 5 వేల మంది గీత కార్మికులు నమోదై ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 400కు పైగా కల్లు షాపులు నడుస్తుండగా, ఇందులో 69 షాపులకు మాత్రమే పర్మిషన్  ఉంది. ప్రతిరోజు 5 వేల కేసులకు పైగా(ఒక్కో కేసులో 24 సీసాలు) కల్లు సీసాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా సంపాదించిన దాంట్లో ఎక్సైజ్  ఆఫీసర్లకు 10 శాతం వాటా ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇల్లీగల్  షాపులపై రైడ్

ఇల్లీగల్  కల్లు షాపులపై మంగళవారం ఎక్సైజ్  ఆఫీసర్లు రైడ్​ చేశారు. మండలంలోని వీరాపూర్, ఎర్రవల్లి, బసల చెరువు, జిల్లెలబండ, సంగాల, కుర్వపల్లి. మల్దకల్  మండలం పెద్దపల్లి, సద్దలోనిపల్లి, నేతువానిపల్లి, మేకల సోంపల్లి గ్రామాల్లో తనిఖీలు చేసి అక్రమంగా ఏర్పాటు చేసిన కల్లు దుకాణాల్లో కల్లు పారబోసినట్లు ఎక్సైజ్  సీఐ గోపాల్  తెలిపారు. కుర్వపల్లిలో కల్లు అమ్ముతున్న కుర్వ ఆంజనేయులు, సద్దనోనిపల్లిలో ఈడిగి వెంకటన్నను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 13 లీటర్ల కల్లును పారబోసి శాంపిల్స్  తీసుకున్నట్లు తెలిపారు. లైసెన్స్  లేకుండా కల్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇల్లీగల్ షాప్ లపై చర్యలు తీసుకుంటాం..

ఇల్లీగల్  షాపులపై చర్యలు తీసుకుంటాం. గద్వాల టౌన్  సొసైటీపై రూల్స్ ప్రకారం వ్యవహరించాం. కోర్టు ఎలా చెబితే అలా నడుచుకుంటాం. కల్లు సొసైటీలో ఎక్సైజ్  ఆఫీసర్లకు వాటాలు లేవు. గీత కార్మికుల మధ్య నెలకొన్న వివాదంతో ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం తగలబెట్టిన షాపులు ఎక్సైజ్ శాఖ పరిధిలో లేవు.

సైదులు, ఎక్సైజ్  సూపరింటెండెంట్​