గీతన్నల గుండెచప్పడు

గీతన్నల గుండెచప్పడు

ఎక్కడ తాటివనం కనిపించినా.. అక్కడ ప్రత్యక్షమై గీత కార్మికుల హక్కులను గుర్తుచేస్తూ వారిలో చైతన్య స్ఫూర్తిని నూరిపోశారు.అనేక జిల్లాల్లో గీత కార్మికులను చెట్టు పన్ను పేరుతో, కల్తీ కల్లు పేరుతో వేధించే భూస్వాములకు, ఎక్సైజ్ అధికారులకు వ్యతిరేకంగా గళం విప్పి ఉద్యమాలు నడిపారు. దాదాపుగా 60 ఏళ్లకు పైగా గీత కార్మికుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేసిన బుర్ర కొండయ్య..ఇటు గీత కార్మికుల నేతగా, అటు సీపీఐ నేతగా తుది శ్వాస విడిచే వరకు జనం నోటిలో నాలుక అయ్యారు. 

కమిటెడ్​ కామ్రేడ్​ 

కరీంనగర్​ జిల్లాలో ఆనాడు సీపీఐ ఎమ్మెల్యేలుగా ఉన్న చెన్నమనేని రాజేశ్వరరావు, దేశిని చిన్న మల్లయ్య నాయకత్వంలో ఆ తర్వాత కాలంలో సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మండలం చెర్ల భుత్కూర్​లో మధ్య తరగతి గీత కార్మిక కుటుంబంలో జన్మించిన బుర్ర కొండయ్య.. చిన్నతనం నుంచే సమాజం కోసం ఆలోచించేవారు.  విద్యార్థి దశ నుంచే దొరల, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీ వైపు ఆయన ఆకర్షితులయ్యారు.  

సుల్తానాబాద్ తాలూకా పరిధిలోని ఎలిగేడ్ కు తన మకాం మార్చి అక్కడి నుంచే ఉద్యమ బావుటా ఎగురవేశారు.1984లో పెద్దపల్లి అసెంబ్లీ  నియోజకవర్గ ఉప ఎన్నిక రావడం, ఆ ఎన్నికను సీపీఐ రాష్ట్ర పార్టీ చాలెంజ్​గా తీసుకొని చెన్నమనేని రాజేశ్వరరావును పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ సమయంలో తాను రేకొండ  సర్పంచ్​గా ఉండడంతో.. వెంట  20 మంది కామ్రేడ్​లను తీసుకొని ప్రచారానికి వెళ్ళాను.  ఆ సమయంలో బుర్ర కొండయ్యతో  మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే, ఆయనతో తుది వరకు స్నేహం కొనసాగింది.

ప్రజాసేవకు జీవితం అంకితం

 పోలీసులకు అందిన సమాచారం మేరకు కొండయ్యను స్థానికంగా ఉండవద్దని నక్సలైట్ల నుంచి ముప్పు ఉన్నందున వెంటనే కరీంనగర్ కు మకాం మార్చాలని పోలీసులు  కోరారు.  నక్సలైట్లు చేసే పనినే  తాను సీపీఐ నేతగా పేదలకు వందలాది ఎకరాల ప్రభుత్వ   భూములను పంచాను.  అలాంటప్పుడు తనకు వాళ్ళ నుంచి ముప్పు ఉంటుందని అనుకోను. నేను వాళ్ళకు భయపడి ఊరు విడిచి వెళ్లనని పోలీసులకు తేల్చి చెప్పారు.  

ప్రజల మద్దతు ఉన్న బుర్ర కొండయ్య విషయంలో చివరకు నక్సలైట్లు తమ మనస్సును మార్చుకున్నారు. సిద్ధాంతానికి, నైతిక విలువలకు, అంకితమై పని చేసేవారు.  గీత కార్మికుల గొప్ప నాయకుడు,  బుర్ర కొండయ్య ఏడాది క్రితం తుది శ్వాస విడవడం  అత్యంత విషాదాన్ని  కలిగించింది. కొండయ్య మన మధ్యలో ఇప్పుడు లేకున్నా.. ఆయన ప్రతి గీత కార్మికుడిలో, ఎర్ర జెండా నీడలో నిత్యం దివిటిగా వెలుగుతూనే ఉన్నాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ, ఆయనకు నివాళిఅర్పిస్తున్నాం.

- చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు‌‌‌‌–