
నల్గొండ అర్బన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఆరు నెలలుగా కల్లుగీత కార్మికులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వీడీసీల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుభాశ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌడ మహిళలను శ్రీరామనవమి సందర్భంగా గుడి నుంచి గెంటివేసి, గీతా కార్మికులకు ఉపాధి కల్పించే ఈత చెట్లను కాల్చివేసిన దుర్మార్గులను తక్షణమే అరెస్టు చేయాలని, వీడీసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. వీడీసీల ముసుగులో రాజ్యాంగేతరశక్తులుగా వ్యవహరించడమే కాకుండా దళితులు బలహీన వర్గాలను సాంఘిక బహిష్కరణలకు గురి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దండెంపల్లి సత్తయ్య, మల్లం మహేశ్, కొండ అనురాధ, దండెంపల్లి సరోజ, ఎండి సలీం, అవుట రవీందర్, ఉప్పల గోపాల్, మన్నెం భిక్షం తదితరులు పాల్గొన్నారు.