కల్లూరు కాకతీయ షుగర్ ఫ్యాక్టరీలో.. చెరుకు క్రషింగ్ ప్రారంభం

కల్లూరు, వెలుగు :  కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో 2023–24 సంవత్సరం సీజన్​కు సంబంధించి చెరుకు క్రషింగ్ ను ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్  చల్లగుండ్ల నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్  నాగేశ్వరరావు దంపతులు, ఫ్యాక్టరీ సివిల్ ఇంజనీర్ కొడాలి రఘునాథ్ బాబు దంపతులు, రైతులు, కార్మికులు, ఫ్యాక్టరీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నాగేశ్వరరావు, కొడాలి రఘునాథ్ బాబు మాట్లాడుతూ చెరకు సాగు చేసిన రైతులను ఫ్యాక్టరీ అన్ని విధాలా ఆదుకుంటూ, రాయితీలిస్తూ రుణాలు మంజూరు చేస్తోందని తెలిపారు.

ఈ సీజన్ లో 1.30 లక్షల టన్నులు చెరుకు క్రసింగ్ చేయలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పాత జోన్ లైన అశ్వరావుపేట, వైరా కుడి వైపు ప్రాంతం, మధిర ఎర్రిపాలెం మండలాలను కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ కింద కలిపినట్లు తెలిపారు. చెరుకు మద్దతు ధర టన్నుకు రూ.3,200 చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరంలో చెరుకు సాగుకు సంబంధించి నాలుగున్నర అడుగుల దూరంలో నాటిన రైతులకు రెండు టన్నుల చెరుకు విత్తనం ఖరీదు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

దూర ప్రాంతాల నుంచి చెరుకు రవాణా చేసే జోన్ రైతులకు 55 కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత ప్రతి టన్నుకు, ప్రతి కిలోమీటర్ కు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. రైతులు సకాలంలో  చెరకు నరికి ప్యాక్టరీకి తేవాలని కోరారు. కార్యక్రమంలో కేన్ అడ్వైజర్ నరసింహమూర్తి, కేన్ డిపార్ట్​మెంట్ ప్రసాద్, పర్సనల్ ఆఫీసర్ మల్లికార్జున్, వేజెండ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.