పాత క్వశ్చన్‌‌ పేపర్‌‌తో కొత్త పరీక్ష

  • కాళోజీ హెల్త్‌‌ వర్సిటీలో అధికారుల నిర్వాకం

వరంగల్‌‌ సిటీ, వెలుగు: పరీక్షల నిర్వహణలో వరంగల్‌‌లోని కాళోజీ హెల్త్‌‌ యూనివర్సిటీ ఆఫీసర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఈ నెల 16న జరిగిన పోస్ట్‌‌ గ్రాడ్యుయేషన్‌‌ రేడియాలజీ విభాగానికి చెందిన పరీక్షలో కొత్తగా తయారు చేసిన క్వశ్చన్‌‌ పేపర్‌‌‌‌కు బదులు.. 2023 నవంబర్‌‌లో జరిగిన పాత ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు. క్వశ్చన్‌‌ పేపర్‌‌ కోడ్‌‌ను కూడా మార్చకుండా స్టూడెంట్లకు పంపిణీ చేశారు. దీనిని గుర్తించిన స్టూడెంట్లు ఈ విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం బయట పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా.. ఆలస్యంగా బయట పడింది.

 ఈ సందర్భంగా ఎగ్జామినేషన్‌‌ ఇన్‌‌చార్జి డాక్టర్‌‌ మల్లేశ్వర్‌‌ మాట్లాడుతూ.. చిన్న పొరపాటు వల్ల పాత పేపర్‌‌ ఇచ్చారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంపై యూనివర్సిటీ వీసీని సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు.