కాళోజీ వర్సిటీ కిరాయి బతుకే!

  • ఏర్పాటై ఐదేళ్లయినా సొంత బిల్డింగ్​ లేదు
  • కాకతీయ మెడికల్​ కాలేజీ పక్కన చిన్న భవనంలోనే..
  • మూడేండ్లుగా సాగుతూనే ఉన్న కొత్త భవన నిర్మాణం
  •  ఉన్నది 40 మందే.. అంతాడిప్యుటేషన్లపై వచ్చినోళ్లే..
  • మూడేళ్ల కింద వంద పోస్టులమంజూరు.. ఇంకా భర్తీకాలే..
  •  బడ్జెట్​లో మెడికల్​ ఎడ్యుకేషన్​కు భారీగా కోత

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు చెందిన ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరు మీద 2014లో వరంగల్‌‌కు హెల్త్  యూనివర్సిటీ మంజూరైంది. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని ఓ బిల్డింగ్​లో తాత్కాలికంగా వర్సిటీని ఏర్పాటు చేశారు. కాళోజీ వర్సిటీకి సొంత బిల్డింగ్, సిబ్బంది లేకపోవడంతో తర్వాతి రెండేండ్ల పాటు ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్‍ హెల్త్  వర్సిటీ కిందనే రాష్ట్రంలోని మెడికల్​ కాలేజీలు కొనసాగాయి. ఆ తర్వాత 2016 ఆగస్టు ఏడో తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ ఏడాది నుంచి వర్సిటీ పరిధిలో అడ్మిషన్లు కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వం వరంగల్​ జిల్లా జైలు పక్కన ఐదెకరాల స్థలం కేటాయించింది. అదే ఏడాది దసరా రోజున వర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంకా ఆ బిల్డింగ్​ పూర్తికాలేదు.

అందరూ డిప్యుటేషన్లపై వచ్చినోళ్లే..

రాష్ట్రంలోని మెడికల్​ కాలేజీలన్నీ కాళోజీ వర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. ఎంబీబీఎస్‍కు సంబంధించి 9 ప్రభుత్వ, 19 ప్రైవేటు, 4 మైనార్టీ కాలేజీలున్నాయి. డెంటల్‍కు సంబంధించి మొత్తం 12 కాలేజీలుండగా.. ఇందులో ఒకటి ప్రభుత్వ కాలేజీ. మొత్తంగా వర్సిటీ పరిధిలో వేలాది మంది స్టూడెండ్లు చదువుతుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే యూనివర్సిటీకి ఇప్పటివరకు పూర్తిస్థాయి రెగ్యులర్‍ సిబ్బంది లేరు. వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్​పై నియమించిన సిబ్బందే పనిచేస్తున్నారు. వర్సిటీ కోసం 2016లోనే 82 రెగ్యులర్‍, 22 ఔట్‍ సోర్సింగ్‍ పోస్టులను మంజూరు చేసి, నోటిఫికేషన్‍ విడుదల చేశారు. ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఇటీవలే జూనియర్‍ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్‍కు సంబంధించి 19 పోస్టులకు నోటిఫికేషన్‍  ఇచ్చారు.

పదో వంతు కూడా లేరు..

ఏపీలోని ఎన్టీఆర్‍  హెల్త్  వర్సిటీలో 400 వరకు సిబ్బంది ఉన్నారు. అదే స్థాయిలో పనిచేయాల్సిన కాళోజీ వర్సిటీలో మాత్రం ఉన్నది 40 మందే. ఇందులో ఒకరిద్దరు మినహా అందరూ ఇతర ఆఫీసుల నుంచి డిప్యుటేషన్‍  మీద వచ్చినవాళ్లే. సిబ్బంది కొరతతో అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర అంశాల్లో మెడికల్  ఎడ్యుకేషన్  డైరెక్టరేట్ సిబ్బంది సాయం తీసుకుంటున్నారు. వర్సిటీ వరంగల్‌‌లో ఉన్నప్పటికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా హైదరాబాద్‌‌లోనే నిర్వహిస్తున్నారు. వర్సిటీకి రెగ్యులర్‌‌‌‌  ఉద్యోగులు లేక, ఉన్నవారికి సాంకేతిక అవగాహన తక్కువగా ఉండడంతో సీట్ల కేటాయింపు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌‌  వంటి అంశాల్లో ఏటా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ కొందరు స్టూడెంట్లు కోర్టుకు వెళ్లారు కూడా. ఎస్సీ, ఎస్టీలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఇటీవల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది.

పరిశోధనలు ఎప్పుడు చేస్తరు?

మెడికల్ కాలేజీల్లో పరిశోధనలు జరిగేలా చూడాల్సిన బాధ్యత వర్సిటీపై ఉంది. ప్రస్తుతం వర్సిటీ నుంచి కాలేజీలకు రీసెర్చ్‌‌  కోసం ఎలాంటి నిధులు ఇవ్వడంలేదు. గతేడాది రూ.10 కోట్లు రీసెర్చ్‌‌ ఫండ్ పేరిట డిపాజిట్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఆ సొమ్ముపై వచ్చే వడ్డీ డబ్బును రీసెర్చ్‌‌  కోసం ఖర్చు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా.. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో మాత్రమే మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌‌ యూనిట్స్‌‌ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టర్  ఆఫ్  మెడికల్  రీసెర్చ్‌‌ ఇచ్చే నిధులతోనే అవి నడుస్తున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులే తప్ప రీసెర్చ్‌‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులేమీ చేయడం లేదని వర్సిటీ వర్గాలు చెప్తున్నాయి.

ఈసారి కేటాయింపులు చారాణా

మెడికల్​ ఎడ్యుకేషన్​కు  ఈసారి బడ్జెట్‌‌ లో ప్రభుత్వం భారీగా కోత వేసింది. గతేడాది రూ.1,472 కోట్లు కేటాయిస్తే.. ఈసారి ఏకంగా రూ.214.7 కోట్లకు తగ్గించింది. మెడికల్‌‌  కాలేజీల రీసెర్చ్‌‌  ఫండ్‌‌  కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. టీచింగ్  హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత ఉండడంతో.. ప్రొఫెసర్లంతా హాస్పిటల్‌‌ డ్యూటీలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోందని.. రీసెర్చ్‌‌కు టైమ్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. సరిపడా ఫాకల్టీ ఉండి, రీసెర్చ్‌‌కు డబ్బులిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జూనియర్​ డాక్టర్లు చెప్తున్నారు.

పర్యవేక్షణ చేసేదెట్లా?

వర్సిటీలో సిబ్బంది కొరత కారణంగా అనుబంధ కాలేజీలపై పర్యవేక్షణ కొరవడుతోంది. అడ్మిషన్లు సరిగా చేసేలా చూడటం, ఎంసీఐ నిబంధనల అమలు, వైద్య విద్య నాణ్యత పెంపు, రీసెర్చ్‌‌ వర్క్ జరిగేలా చూడటం వంటి ఎన్నో బాధ్యతలు వర్సిటీపై ఉంటాయి. సిబ్బందే లేకపోవడంతో కాలేజీలకు వెళ్లి పర్యవేక్షించలని పరిస్థితి ఉంది. దాంతో ప్రైవేటు మెడికల్​ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా, స్టూడెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా, ప్రమాణాల మేరకు లేకపోయినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.