వరంగల్, వెలుగు: ఓరుగల్లులో ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రం రెడీ అవుతోంది. హనుమకొండ బస్టాండ్రోడ్హయగ్రీవచారి గ్రౌండ్లో ఏండ్ల తరబడి తుప్పుపట్టిన సలాకలు.. రంగుల్లేని గోడలతో దర్శన మిచ్చిన కళాక్షేత్రం ప్రస్తుతం కలర్ఫుల్గా కనిపిస్తోంది. పదేండ్ల కింద కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ శంకుస్థాపన చేసింది. పనులు సాగదీసి పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కళాక్షేత్రం నిర్మాణ పనులపై ఫోకస్ చేసింది. దీంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈనెల 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఏడాదిలో నిర్మిస్తామని.. పదేండ్లు సాగదీత
2014 సెప్టెంబర్9న కాళోజీ జయంతి సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ.50 కోట్లతో ఏడాదిలో కళాక్షేత్రం పనులు పూర్తి చేస్తామని, తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని చెప్పారు. తీరా నిర్మాణం మొదలుపెట్టగా.. మూడు నెలలు నడుస్తూ.. ఆరు నెలలు ఆగుతూ సాగాయి. 2023 వరకు కూడా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారు. మరోవైపు నిర్మాణంలోని భవనం పిల్లర్లు కుంగాయి. ఎన్ఐటీ సివిల్ఇంజినీర్ల టీమ్ పరిశీలించి వర్క్స్క్వాలిటీ లేవని రిపోర్ట్ఇచ్చింది. కళాక్షేత్రానికి ప్రధానంగా నిలిచే నాలుగు పిల్లర్లకు రెట్రో ఫిట్టింగ్చేయాలని సూచించింది.
దీంతో రూ.50 కోట్ల వ్యయం కాస్త రూ.75 కోట్లకు చేరింది. అయినా పనులు కంప్లీట్ కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. సెప్టెంబర్9 నాటికి పనులు పూర్తి చేయాలని డెడ్లైన్పెట్టారు. పెండింగ్‌లో ఉన్న రూ.40 కోట్లనురాష్ట్ర జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేయించారు. దీంతో మొత్తం వ్యయం రూ.90 కోట్లకు చేరింది. ఈనెల 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనుండగా ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు.
రాజ్‌మహల్ తరహాలో నిర్మాణం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి ధీటుగా ఓరుగల్లులో జైపూర్ సిటీలోని రాజ్మహల్తరహాలో నిర్మించిన కళాక్షేత్రం ఆకట్టుకుంటోంది. కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాలను చూసేందుకు రెండు అంతస్తుల్లో సీటింగ్కెపాసిటీ కల్పించారు. ప్రధాన స్టేజీకి ముందు మొదటి అంతస్తులో 22 వరుసలు, రెండో అంతస్తులో మరో 7 వరుసల కుర్చీల్లో కూర్చుంటే స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దారు. 60 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడవుతో 2,400 చదరపు అడుగులతో భారీ స్టేజీకి ఉడెన్ ఫ్లోరింగ్నిర్మించారు.
అడ్వాన్స్డ్ లైటింగ్, సెంట్రల్ ఏసీ కల్పించారు. ఒక్కో ఫ్లోర్లో గ్రానైట్, మార్బుల్స్వాడటంతో విద్యుద్దీపాల కాంతుల్లో వెలిగిపోతోంది. దీని ముందే 10 అడుగుల కాళోజీ విగ్రహం ఏర్పాటు చేశారు. కళాక్షేత్రానికి ముందు తామరపూల ఆకారంలో వాటర్ ఫౌంటెన్లు, గార్డెన్తో తీర్చిద్దారు. హనుమకొండ బస్టాండ్మెయిన్రోడ్వైపు ఎంట్రీ, ఎగ్జిట్‌తో 2 మెయిన్‌గేట్లు పెట్టారు. ఎడమవైపు శ్రీనివాస్‌నగర్ సైడ్ మరో ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు చేశారు.
కళాక్షేత్రం ప్రత్యేకతలు
- నాలుగున్నర ఎకరాల్లో 4 అంతస్తుల్లో భవనం
- రెండు అంతస్తుల్లో 1,160 మందికి సీటింగ్ కెపాసిటీ
- 2,990 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆడిటోరియం
- 2,400 అడుగుల భారీ స్జేజీ.. డిజిటల్ సౌండ్ సిస్టమ్
- భవనం ముందు కాళోజీ విగ్రహం.. చుట్టూ వాటర్ ఫౌంటెన్లు
- 3 మెయిన్ గేట్లు..100 కార్లు పట్టేలా పార్కింగ్ సౌకర్యం