- సెప్టెంబర్ 9న ప్రారంభించేందుకు చర్యలు
- 2014లో శంకుస్థాపన చేసి, ఏడాదిలోనే పూర్తిచేస్తామన్న బీఆర్‌ఎస్ సర్కార్
- నిధులు విడుదల చేయకపోవడంతో తొమ్మిదేళ్లుగా ఆగిన పనులు
- కళాక్షేత్రం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
- పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేయడంతో ముమ్మరంగా సాగుతున్న పనులు
వరంగల్, వెలుగు: ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరుతో ఓరుగల్లులో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‍ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం కాళోజీ జయంతికి మూడు, నాలుగు నెలల ముందు కాస్త హడావుడి చేసిన అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తర్వాత పనులను పట్టించుకోలేదు.
దీంతో శంకుస్థాపన చేసి తొమ్మిదేండ్లు గడిచినా పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాక్షేత్రం నిర్మాణ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు. కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ప్రారంభించాలని ఆదేశాలిస్తూ సెప్టెంబర్ 9న ముహుర్తంగా పెట్టారు. దీంతో పనులు జెట్ స్పీడ్‌తో కొనసాగుతున్నాయి.
2014లోనే శంకుస్థాపన
కాళోజీ జయంతి సందర్భంగా 2014 సెప్టెంబర్ 09న అప్పటి సీఎం కేసీఆర్ హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం పనులకు శంకుస్థాపన చేశారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్‌లోని నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో 12,990 చదరపు మీటర్ల వైశాల్యంలో రవీంద్రభారతిని తలదన్నేలా కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తామని, ఈ పనులను ఏడాదిలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అతిపెద్ద కాళోజీ విగ్రహంతో పాటు గార్డెన్ సైతం ఉండేలా నిర్మించాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కేవలం సాంస్కృతిక, కళా ప్రదర్శలనకే కాకుండా, వివాహాలు, ఇతర సమావేశాలకు సైతం ఉపయోగపడేలా డిజైన్ చేయించాలన్నారు. సుమారు రెండు వేల మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మించాలని ఆదేశించారు. ఈ పనులన్నింటికీ రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
జీ ప్లస్ ఫోర్ మోడల్‌లో కళాక్షేత్రం
కాళోజీ కళాక్షేత్రాన్ని మూడు దశల్లో జీ ప్లస్ ఫోర్ మోడల్‌లో నిర్మించనున్నట్లు ప్రకటించారు. పనులను టూరిజం శాఖకు అప్పగించారు. మొదటి దశలో సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు, మూడో దశలో ల్యాండ్ స్కేపింగ్, పాథ్‌వే, పార్కింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఒక్కో అంతస్తుకు ఒక్కో ప్రత్యేకత ఉండేలా నాలుగు అంతస్తుల్లో బిల్డింగ్ ప్లాన్ చేశారు.
గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, రిహార్సల్స్ రూం, గ్రీన్‌రూం, లాబీ ఉంటాయన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఆర్టియం, ప్రీ ఫంక్షన్స్ వేదిక, ఆఫీస్ రూంలు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, వాష్ రూమ్స్, రెండో అంతస్తులో లైబ్రరీ, ఆఫీస్, స్టోర్స్, లాబీ, వాష్‌రూమ్స్, మూడు, నాలుగు అంతస్తుల్లో ప్రీ ఫంక్షన్స్ హాల్స్, లాబీ, బాల్కనీ, టెర్రస్, క్యాట్‌వాక్ లాబీ నిర్మాణం అంటూ పనులు ప్రారంభించారు.
బిల్లులివ్వని సర్కార్.. కుంగిన నిర్మాణాలు
కళాక్షేత్రం పనులు ఏడాదిలోనే పూర్తి చేసేలా రూ.50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వ పెద్దలు తర్వాత ఆ హామీని విస్మరించారు. టెండర్ల సమయంలో హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ సిర్కో సంస్థ రూ.30 కోట్ల సివిల్ పనులను దక్కించుకుంది. తర్వాత వరంగల్ లోకల్ కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వర్క్ మొదలై రూ.కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తర్వాత నిర్మాణ పనులను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఈ క్రమంలో నిర్మాణ పనులు కొన్ని చోట్ల కుంగిపోయాయి. దీంతో వరంగల్ ఎన్‌ఐటీ సివిల్ ఇంజినీరింగ్ టీమ్ కళాక్షేత్రం పనులను పరిశీలించి పనుల్లో క్వాలిటీ లేదంటూ రిపోర్ట్ ఇచ్చింది. కళాక్షేత్రానికి ప్రధానంగా నిలిచే నాలుగు పిల్లర్లు బలంగా ఉండేందుకు రెట్రో ఫిట్టింగ్ చేయాలని సూచించారు. దీంతో రూ.50 కోట్ల పనులను రూ.70 కోట్లకు, ఆపై డిజైన్ల మార్పు పేరుతో మరో రూ.5 కోట్లు పెంచారు. ఇవన్నీ చేసినా కూడా కళాక్షేత్రం పనులను పూర్తి చేయలేకపోయారు.