- ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి జూపల్లి
- రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
బషీర్బాగ్, వెలుగు: పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు తెలంగాణ సాహిత్యానికి, సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ యాసకు, భాషకు జీవంపోసి.. ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన మహనీయుడని ఆయన కొనియాడారు. కాళోజీ నారాయణ రావు 108వ జయంతి వేడుకలను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘ప్రజాకవి కాళోజీ మానవతా విలువలు’ అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యతిథిగా హాజరయ్యారు. ముందుగా కాళోజీ చిత్ర పటానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు ఎంతో గొప్పవని మంత్రి కొనియాడారు.
న్యాయం ఎక్కడ జరిగినా కాళోజీ గళమెత్తేవారని.. అసమానతలు, దోపిడీ, నిరాదరణకు గురవుతున్న వారిలో ఆయన కలం చైతన్యాన్ని నింపిందని గుర్తుచేశారు. ముఖ్యంగా స్థానిక భాషకు ప్రాధాన్యతనిచ్చి ఎవరి వాడుక భాషలో వారు రాయాలని.. ఇతరుల భాషను అనుకరించే బానిస భావన పోవాలని ఆయన తపించిన తీరుతో ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవం పెల్లుబికుతోందన్నారు.
కాళోజీ కవితా సంకలనం 'నా గొడవ'లో ఆయన రాసిన అనేక పద్యాలను ఆయన ఉటంకిస్తూ.. ఆయన కవితాశక్తిని, భావుకతను, పోరాట ప్రతిభను, తెలంగాణ తపనను ఈ సందర్భంగా మంత్రి జూపల్లి గుర్తుచేసుకున్నారు.
జల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ చిరస్మరణీయులని.. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రజా వాగ్గేయకారుడు అందెశ్రీ, తదితరులు పాల్గొన్నారు.