
- జయంతి వేడుకలో వక్తలు
హైదరాబాద్, వెలుగు: బతుకును ఆరాధించిన గొప్ప కవి కాళోజీ అని వక్తలు కొనియాడారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు 105వ జయంతిని సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పేరిట ఇస్తున్న సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డికి ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఆత్మీయ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా. నందిని సిధారెడ్డి, సంగీత నాటక అకాడమి చైర్మన్ బాదిమి శివకుమార్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రామగుండ ఎమ్మెల్యే చందర్, మహబూబ్నగర్జడ్పీ చైర్మన్స్వర్ణ, కాళోజీ ఫౌండేషన్ నిర్వాహకుడు నాగిళ్ల రామశాస్త్రి పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ తెలుగు భాషను గొప్పగా అభిమానించిన కవి కాళోజీ అని అన్నారు. తెలంగాణ ప్రాంత సాహిత్యం, సంస్కృతి, జీవన విధానం ఎంతో ప్రత్యేకమైనవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలుగు కవులలో కాళోజీ ప్రత్యేకమని కొనియాడారు. వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రం పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి అండగా ఉంటూ, తొలిదశ ఉద్యమానికి అండగా నిలిచారని అన్నారు.
అసెంబ్లీలో కాళోజీకి నివాళి
హైదరాబాద్, వెలుగు: ప్రజా కవి, స్వర్గీయ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అసెంబ్లీలో ఆయన చిత్రపటానికి స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ లాబీలోని మెంబర్స్ లాంజ్‌లో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.