
వరంగల్, వెలుగు: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1న ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో సూచించారు.
ఆన్ లైన్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇతర వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో తెలుసుకోవచ్చని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ కోర్సులకు.. 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కూడా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగేండ్ల బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బిఎస్సీ నర్సింగ్) డిగ్రీ కోర్స్, రెండేండ్ల పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పోస్ట్ బీఎస్సీ నర్సింగ్) డిగ్రీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాను, సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
అక్టోబర్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుండి 4 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అభ్యర్థులతో సహా అర్హులైన అభ్యర్థులు అందరూ కోర్స్, కాలేజీ వారిగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని, మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.