‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’’
అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి..
‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే
నా గొడవకు సంతృప్తి..
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తిప్రాప్తి..
అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు’’
అంటూ ప్రకటించిన ప్రజాకవి..
మన కాళోజీ నారాయణరావు!!
ఇయ్యాల కాళోజీ జయంతి
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-..అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. మాడపాటి, సురవరం, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు.
రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు కాళోజీకి నగర బహిష్కరణ శిక్ష విధించారు . స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర కీలకం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం కాళోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘సామాన్యుడే నా దేవుడు’ అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణానంతరం కాళోజీ పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుంచి 1960 వరకు పనిచేశారు. రెండేండ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. కాళోజీ ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు.
తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగానూ, 1957–-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యుడిగానూ ఉన్నారు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. కాగా, తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో భాష సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుంచి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
- యాడవరం చంద్రకాంత్ గౌడ్