కాళోజీ కుమారుడి కన్నుమూత

  • కిడ్నీ సంబంధ సమస్యతో మరణించిన రవికుమార్​
  • కండ్లు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులు

హనుమకొండ, వెలుగు : ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఒక్కగానొక్క కొడుకు రవికుమార్​(68) అనారోగ్యంతో కన్నుమూశారు. కాళోజీ జయంతి ఉత్సవాలు ముగిసిన మరునాడే ఆయన చనిపోయారు. ఆంధ్రాబ్యాంక్​ ఉద్యోగిగా పని చేసిన రవికుమార్ కొంతకాలం కింద అనారోగ్య సమస్యలతో వాలంటరీ రిటైర్మెంట్​తీసుకున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తడంతో కొద్దిరోజులుగా ట్రీట్​మెంట్ ​తీసుకుంటున్నారు. గత వారం సమస్య తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు హనుమకొండ ఆరెపల్లి సమీపంలోని ప్రతిమా హాస్పిటల్​ లో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. రవి కుమార్​ మృతికి పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు సంతాపం తెలిపారు. 

ALSO READ :ఔట్​సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు జీతాల్లేవు

ఇప్పటికే కాళోజీ నారాయణరావుతో పాటు ఆయన అన్న రామేశ్వరరావు మృతదేహాలను కాకతీయ మెడికల్ కాలేజీకి డొనేట్​చేయగా.. రవికుమార్ ​కుటుంబసభ్యుల అంగీకారంతో ఆయన కండ్లను తెలంగాణ నేత్రదాతల అసోసియేషన్​ వరంగల్​ జిల్లా అధ్యక్షుడు కొన్​రెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎల్​వీ ప్రసాద్​ఐ హాస్పిటల్​కు అప్పగించారు. రవికుమార్​కు భార్య వాణి, కొడుకు సంతోష్ ఉన్నారు. సంతోష్​ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇటీవలే  వరంగల్ వచ్చారు. అంత్యక్రియలు సోమవారం ఉదయం హనుమకొండలోని పద్మాక్షి శివ ముక్తి స్థల్ లో  నిర్వహించనున్నారు. 

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి విచారం

హైదరాబాద్​: రవి కుమార్​మరణంపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాళోజీ జయంతి, తెలంగాణ భాషాదినోత్సవం జరుపుకున్న తర్వాత రోజే ఇలా జరగడం బాధాకరమన్నారు. రవికుమార్​ ఆత్మకు శాంతి చేకూరాలన్న ఆయన.. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.