మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్​కు నోటిఫికేషన్ విడుదల

మెడికల్ పీజీ సీట్ల కౌన్సెలింగ్​కు నోటిఫికేషన్ విడుదల
  • నేటి నుంచి 7వ తేదీ వరకూ దరఖాస్తులకు గడువు 
  • స్థానిక కోటా కింద తెలంగాణ విద్యార్థులకే అర్హత  

హైదరాబాద్, వెలుగు:  మెడికల్‌‌ పీజీ, డిప్లోమా సీట్ల కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌‌కు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్‌‌ పీజీ-లో క్వాలిఫై అయిన అభ్యర్థులు గురువారం ఉదయం 6 గంటల నుంచి వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు యూనివర్సిటీ వెబ్‌‌సైట్‌‌లో ( https://tspgmed.tsche.in_ ) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విద్యార్హత, కమ్యూనిటీ సహా అవసరమైన అన్ని సర్టిఫికెట్లను తప్పకుండా అప్‌‌లోడ్ చేయాలని పేర్కొంది. అన్ని సర్టిఫికెట్లను పరిశీలించి మెరిట్ జాబితా విడుదల చేస్తామని, ఆ తర్వాత వెబ్‌‌ ఆప్షన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. 

ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో ప్రవేశాలకు కూడా యూనివర్సిటీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచే వాటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. ఏఐఏపీజీఈటీ- పరీక్షలో అర్హత సాధించినవారు ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు అర్హులు అని వర్సిటీ పేర్కొంది. ఆన్‌‌లైన్ దరఖాస్తులు సమర్పించే సమయంలో ఏమైనా సందేహాలు వస్తే 9392685856, 7842136688, 9059672216 నంబర్లకు ఫోన్‌‌ చేయాలని సూచించారు.  

తెలంగాణ వారికే సీట్లు

మెడికల్ పీజీ సీట్లలో స్థానిక కోటా కింద తెలంగాణ విద్యార్థులే అర్హులు అని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. స్థానికులుగా గుర్తించాలంటే నీట్ పీజీ రాయడానికంటే ముందు వరసగా 4 ఏండ్లు తెలంగాణలో చదివి ఉండాలని పేర్కొన్నారు. నేషనల్ కోటా, అన్‌‌రిజర్వ్‌‌డ్ కోటాలో తెలంగాణలోని కాలేజీల్లో సీట్లు సాధించిన ఇతర రాష్ట్రాల విద్యార్థులు, లోకల్‌‌ కోటాకు అర్హులు కాదు అని స్పష్టం చేశారు. అయితే, ఆల్ ఇండియా కోటాలో సీట్లు సాధించి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివిన తెలంగాణ విద్యార్థులను లోకల్‌‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. అలాగే, అన్‌‌రిజర్వ్‌‌డ్ కేటగిరీలో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్‌‌ కాలేజీలో చదివిన తెలంగాణ విద్యార్థులను కూడా లోకల్‌‌ విద్యార్థులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.