
- ఆయుష్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు
- 2వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
వరంగల్సిటీ, వెలుగు : యూజీ ఆయుష్ మెడికల్ కోర్సులో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ , బీఎన్ వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 2వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
ఎంబీబీఎస్ స్ర్టే వేకెన్సీ నోటిఫికేషన్
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు 25వ తేదీ(సోమవారం) సాయంత్రం 4 గంటల నుంచి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. 26 వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ర్టే వేకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఏంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, నిబంధనలు ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్ ను సంప్రదించాలని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు. కాగా..వెబ్ ఆప్షన్లకు కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై స్టూడెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.