CM హేమంత్ సోరెన్ భార్య ఘన విజయం.. ఏ నియోజకవర్గం నుంచి అంటే..?

CM హేమంత్ సోరెన్ భార్య ఘన విజయం.. ఏ నియోజకవర్గం నుంచి అంటే..?

రాంచీ: జేఎంఎం నాయకురాలు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. గాండే అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన కల్పనా సోరెన్.. బీజేపీ అభ్యర్థి మునియా దేవిని 17,142 ఓట్ల తేడాతో చిత్తు చేశారు. తాజా విజయంతో గాండే అసెంబ్లీ స్థానం నుండి వరుసగా రెండో సారి కల్పనా విజయం సాధించారు. ఈ ఏడాది ప్రారంభంలో సీఎం హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడంతో కల్పనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

కల్పనా కోసం గాండే నియోజకవర్గ జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. గాండే ఉప ఎన్నికలో పోటీ చేసిన కల్పనా ఘన విజయం సాధించి తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కల్పనా మరోసారి గాండే నుండే బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థి మునియా దేవిపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. 

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమిని చిత్తు చేసి వరుసగా రెండోసారి జార్ఖండ్ గడ్డపై జెండా ఎగరేసింది. జార్ఖండ్‎లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 45 సీట్లను క్రాస్ చేసి 56 స్థానాల్లో ఇండియా కూటమి విజయఢంకా మోగించింది. దీంతో వరుసగా రెండోసారి జార్ఖండ్‎లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. జార్ఖండ్ సీఎం పగ్గాలను మరోసారి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ చేపట్టనున్నట్లు సమాచారం.