- ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ముషీరాబాద్,వెలుగు: హైదరాబాద్ లోని రామకృష్ణ మఠంలో కల్పతరు పర్వదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. విశేష పూజలు, భజనలు, హోమం, ఆలయ ప్రదక్షిణం, ఆరాత్రికంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులనుద్ధేశించి రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడారు.
కల్పతరు పర్వదినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. 1886, జనవరి 1న పశ్చిమబెంగాల్‌లోని కాశీపూర్ ఉద్యానవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీరామకృష్ణ పరమహంస కల్పవృక్షంలా మారి భక్తుల కోరికలు తీర్చారని గుర్తుచేశారు. ఆనాటి నుంచి ఏటా రామకృష్ణ మఠం, మిషన్ కేంద్రాల్లో కల్పతరు దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.