పాలమూరులో పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు

పాలమూరులో పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
  • మహబూబ్​నగర్​ జీజీహెచ్​ లో 35మందికి పైగా చేరిక

మహబూబ్​నగర్​, వెలుగు :పాలమూరులో కల్తీకల్లు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈనెల 7(శుక్రవారం) నుంచి సోమవారం పొద్దటి వరకు 20 మంది బాధితులు చేరినట్లు హాస్పిటల్​ వర్గాలు చెబుతున్నా.. అనధికారికంగా 35 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరికి  ఓపీ ద్వారా ట్రీట్​మెంట్​ అందించి ఇండ్లకు పంపగా, పరిస్థితి క్రిటికల్​గా ఉన్న వారిని అడ్మిట్​ చేసుకొని చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులుగా కల్తీకల్లు తాగి బాధితులు హాస్పిటల్​ పాలవుతున్నా..  ఎక్సైజ్​ ఆఫీసర్లు, లీడర్లు  హాస్పిటల్​ వైపు కన్నెత్తి చూడడం లేదు.

జిల్లాలోని దొడ్లోనిపల్లి, కోయనగర్​, మోతినగర్​ ప్రాంతాలకు చెందిన పది మంది కల్తీ కల్లు తాగి అస్వస్థతతో శుక్రవారం మహబూబ్​నగర్​ జీజీహెచ్​లో అడ్మిట్ అయ్యారు. నలుగురికి ట్రీట్​మెంట్​ చేసిన డాక్టర్లు ఇంటికి పంపించారు.ఆరుగురిని అబ్జర్వేషన్​లో ఉంచారు. అదే రోజు రాత్రి మరో ఐదుగురు కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేశారు. ఒక మహిళ పరిస్థితి సీరియస్​గా ఉండడంతో నాలుగు రోజులుగా ట్రీట్​మెంట్​ అందిస్తూనే ఉన్నారు. వీరితో పాటు శనివారం నుంచి జీజీహెచ్​కు కల్తీకల్లు బాధితులు క్యూ కడుతున్నారు. ఇందులో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఒకరు, మహబూబ్​నగర్​ జిల్లాలోని జడ్చర్ల, నవాబ్​పేట, మహబూబ్​నగర్​ రూరల్​ మండలానికి చెందిన పది మంది ఉన్నారు. నాలుగు రోజుల్లో 20 మంది కల్తీకల్లు తాగి హాస్పిటల్​లో అడ్మిట్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నా.. సోమవారం ఉదయం వరకు దాదాపు 35 మంది హాస్పిటల్​లో చేరినట్లు తెలిసింది. 

ఇష్యూను బయటకు రానివ్వట్లే..

కల్తీకల్లు బాధితులు హాస్పిటల్​కు చేరుతున్నా, ఈ ఇష్యూను బయటకు రానివ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్పిటల్​ కేస్​ షీట్లలో కల్తీకల్లు తాగడం వల్లే బాధితులు అస్వస్థత చెందినట్లు నోట్​ చేస్తున్నా,  ఎండలకు డీహైడ్రేషన్​ అయ్యిందని  కొందరు డాక్టర్లు బయటకి చెబుతున్నారు.  ప్రస్తుతం హాస్పిటల్​లోని ఐసీయూలో ముగ్గురు,  ఫీమేల్​, మేల్​ జనరల్​ వార్డుల్లో దాదాపు ఎనిమిది మంది ట్రీట్​మెంట్​ పొందుతున్నారు.  కల్తీకల్లు బాధితులు హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యారని మీడియా హాస్పిటల్​కు చేరుకోగా, ఆంక్షలు విధించి లోపలికి ఎవరినీ రానివ్వడం లేదు. 

బాధితులంతా కూలీలే..

కల్తీకల్లు తాగి హాస్పిటల్​లో  అడ్మిట్​అవుతున్న వారిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలే ఉన్నారు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. వీరంతా రోజు  పనులను ముగించుకొని ఇండ్లకు వెళ్లేటప్పుడు కల్లు కాంపౌండ్ల వద్ద కల్లు తాగుతారని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. కొందరు పనిలో అలిసిపోతే ఇంటికి తెచ్చుకొని తాగే వారని అంటున్నారు.

అందరికీ  ఒకే లక్షణాలు​..

హాస్పిటల్​లో అడ్మిట్​ అయిన బాధితులందరికీ ఒకే రకమైన లక్షణాలు బయటపడుతున్నాయి. మెడ వెనుక భాగంలో తిమ్మిర్లు రావడం,  చేతులు వణకడం, తల వెనక్కి వాలిపోవడం, నాలుక బయట పెట్టడం, మాటలు నత్తి నత్తిగా రావడం, గొంతు ఇన్​ఫెక్షన్​, శరీరంలో చలనం లేకపోవడంతో పాటు మూడు, నాలుగు రోజులైనా నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కనబడుతున్నాయి. కొందరు లేవలేని స్థితిలో హాస్పిటల్​లో  మంచానికే పరిమితం అయ్యారు. 

ఆల్ప్రాజోలం కలుపుతున్నట్లు సమాచారం..

కల్తీకల్లులో  నిషా రావడానికి ఆల్ర్పాజోలంను కలుపుతున్నట్లు తెలిసింది. ఇది డ్రగ్​కన్నా ప్రమాదకమైంది.  దీన్ని నిద్ర మాత్రల తయారీలోనూ వాడతారు. వీటిని అమ్మాలంటే స్టేట్​ డ్రగ్​ డిపార్ట్​మెంట్​ నుంచి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ మాత్రల తయారీ కంపెనీలు మహారాష్ర్ట, కర్ణాటకలలో ఉన్నాయి. ఇవి పాలమూరు జిల్లాకు పక్కనే ఉండడంతో, కల్తీకల్లు దందా నిర్వహిస్తున్న వారు అక్కడి నుంచి కిలోల చొప్పున అల్ర్పాజోలంను రహస్యంగా కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. వాటిని కల్లులో కలిపి అమ్ముతున్నట్లు సమాచారం. రెగ్యులర్​ డోస్​ కంటే కొంచెం ఎక్కువ, తక్కువ కల్లులో కలిపినా,  అది తాగిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు.

మాటలు వస్తలేవు..

నేను రోజు మట్టి పనికి పోత. నా భార్యకు కల్లు తాగే అలవాటుంది. ఏమైందో ఏమో నాలుగు రోజుల నుంచి మాటలు రావడం లేదు. శరీరంలో చలనం లేదు. ఈ నెల 7వ తేదీన హాస్పిటల్​లో చేర్పించినం.. తిండి కూడా తింటలేదు. నీళ్లే తాగిస్తున్నం.–సురేశ్​, బాధితురాలి భర్త, మహబూబ్​నగర్​

మెడలు వంకర్లు పోతున్నయ్​..

నా బిడ్డ వ్యవసాయ కూలి పనులకు పోతది. పనికిపోయి వచ్చినంక రోజు ఒకటి, రెండు గిలాసల కల్లు తాగుతుండే. శుక్రవారం రాత్రి ఉన్నట్లుండి మెడలు వంకర్లు పోయినయ్​. నత్తి నత్తి మాట్లాడింది.శనివారం హాస్పిటల్​లో చేర్పించినం.–కిష్టమ్మ, బాధితురాలి తల్లి, నవాబ్​పేట

ఎవరూ స్పందించట్లే..

కల్తీకల్లు బాధితులు పెరుగుతున్నా ఎక్సైజ్​ ఆఫీసర్లు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదని తెలిసింది. ఫలానా దుకాణంలో కల్లు తాగడం వల్లే ఇలా అవుతోందని కొందరు బాధితుల కుటుంబ సభ్యులు చెప్పినా, ఆ దుకాణాలపై చర్యలు తీసుకోవడం లేదు. ఇష్టారీతిన కల్లు అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కేవలం శాంపిల్స్​ సేకరించి టెస్టులకు పంపించాం ..అని చెబుతున్నారే తప్ప, కల్తీకల్లు విక్రయాలను అరికట్టడం లేదు.