73 క్వింటాళ్ల కల్తీ అల్లమెల్లిగడ్డ పేస్ట్​

73 క్వింటాళ్ల కల్తీ అల్లమెల్లిగడ్డ పేస్ట్​
  • బుద్వేల్​లో స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు
  • యాసిడ్లు, కెమికల్ వాటర్, సింథటిక్‌‌‌‌ కలర్లతో తయారీ​
  • టెస్టుల కోసం ల్యాబ్​కు శాంపిల్స్​ 
  • పేస్ట్​ను బేగం బజార్​, కిరాణాలకు సప్లయ్ చేస్తున్నట్లు గుర్తింపు

గండిపేట, వెలుగు : హైదరాబాద్​ శివారులోని కల్తీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్​తయారీ యూనిట్​ గుట్టు రట్టయింది. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రైడ్​చేసి, 7.3 టన్నుల కల్తీ పేస్ట్​ను పట్టుకున్నారు.  హైదరాబాద్​లోని రాజేంద్రనగర్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ బుద్వేల్ గ్రీన్‌‌‌‌ సిటీ వెంచర్‌‌‌‌లో అమీర్‌‌‌‌ నిజాన్‌‌‌‌ అనే వ్యాపారి ఎలాంటి అనుమతులు లేకుండా ‘అప్న ఎంటర్‌‌‌‌ ప్రైజెస్‌‌‌‌’ పేరుతో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్​ తయారీ యూనిట్​ను నిర్వహిస్తున్నాడు. ప్రమాదకర యాసిడ్లు, కెమికల్​వాటర్, సింథటిక్‌‌‌‌ కలర్లు వాడుతూ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్​తయారుచేస్తున్నాడు.

వాటిని50 గ్రాంలు, 250 గ్రాంలు, 500 గ్రాంలు, కేజీ ప్యాకెట్లు, 5 కేజీల డబ్బాల్లో ప్యాక్​చేసి సిటీలోని బేగం బజార్​తోపాటు వారాంతపు సంతలు, కిరాణా షాపులు, ఫాస్ట్​ఫుడ్​సెంటర్లు, హోల్​సేల్​షాపులకు సప్లయ్​చేస్తున్నాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓటీ పోలీసులు శుక్రవారం సదరు యూనిట్​పై దాడి చేశారు. పెద్ద డ్రమ్ముల్లో స్టోర్​చేసిన 7.3 టన్నుల కల్తీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్​ను స్వాధీనం చేసుకున్నారు.

తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని సీజ్​చేశారు. కల్తీ పేస్ట్​శాంపిల్స్​ను టెస్టుల కోసం ల్యాబ్​కు పంపించారు. స్వాధీనం చేసుకున్న పేస్ట్​విలువ బయటి మార్కెట్​లో రూ.15 లక్షలు ఉంటుందని తెలిపారు.  అమీర్‌‌‌‌ నిజాన్‌‌‌‌ దాదాపు 8 మంది సిబ్బందితో, 3  నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ యూనిట్​ను నడిపిస్తున్నట్టు తెలిసింది.