- అల్లు అర్జున్‌పై ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఫైర్
హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి నటుడు అల్లు అర్జున్ కేవలం రూ. 10 లక్షల డీడీలు ఇచ్చి, రూ. 25 లక్షలు సహాయం చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఆరోపించారు. సో మవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..రేవతి తమ సామాజిక వర్గానికి చెందిన మహిళా అని, ఆమె మృతిపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలకు తమ ఓట్లు కావాలి కానీ, ఇలాంటి సమయంలో ఆర్యవైశ్య కుటుంబం బాధ వాళ్లకు కనిపించకపోవడం బాధాకరమని వివరించారు. అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు ఆర్యవైశ్యులు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని ఆమె హెచ్చరించారు. రేవతి కుమారుడి వైద్య ఖర్చులన్నీ తమ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తప్పుడు ప్రకటనలు చేసిన అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని సుజాత డిమాండ్ చేశారు. సహాయం చేయకున్నా చేసినట్లు తప్పుడు ప్రచారం చేసుకోవడం అల్లు అర్జున్ కే చెల్లిందని పేర్కొన్నారు.