కల్వకుంట్ల కుటుంబం వందల కోట్లు సంపాదించుకున్నరు : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే లీటరుకు రూ. 10 తగ్గిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న వివేక్ వెంకటస్వామి.. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామం లో చేపట్టిన బీజేపీ జెండా ఆవిష్కరణకు హాజరయ్యారు. అనంతరం బైక్ ర్యాలీ పాల్గొని...  ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అని చెప్పిన కేసీఆర్ మర్చిపోయారని ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రైతులకు కోటీశ్వరులు చేయలేదు కానీ ఆయన కుటుంబసభ్యులు  వందల, వేల కోట్లు సంపాదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మునుగోడులో పోలీసులు, అధికార యంత్రాంగం, పోల్ మేనేజ్మెంట్ తోనే కేవలం10,000 మెజారిటీతోటి టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మీటర్ కు రూ.20 పెట్రోల్ ధర తగ్గిస్తే, తెలంగాణ సీఎం ఒక్క పైసా కూడా తగ్గించలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే లీటర్ కు రూ.10 తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మిషన్ భగీరథ, కాళేశ్వరంలో గోల్ మాల్ జరిగిందన్న వివేక్ వెంకటస్వామి.. బీజేపీపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోడీ, బండి సంజయ్ నాయకత్వంలో ముందుకు సాగాలని సూచించారు.