కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు : కల్వకుంట్ల కవిత

మెట్ పల్లి, మల్లాపూర్‌‌, వెలుగు:  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వవద్దని, బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం మెట్ పల్లి మండలం  బండలింగపూర్, వెల్లుల్ల, మల్లాపూర్,  ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల్లో చెరువులు నీళ్లతో   కళకళలాడుతున్నాయని తెలిపారు. 

చెరువు ఎండిపోయినప్పుడు చెరువును విడిచిపెట్టి కప్పలు వెళ్లిపోతాయి. కానీ చేపలు మాత్రం చెరువు నిండినా ఎండినా అక్కడే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ వాళ్లు చేపల్లాంటి వాళ్లని, కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కప్పల వంటి వాళ్లని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, నియామకాలపై, ప్రాజెక్టులపై కేసులు వేస్తూ మళ్లీ ఏమీ తెలియనట్టు నంగనాచిలా గ్రామాల్లోకి వచ్చి సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. 

ALSO READ: మిర్యాలగూడలోని రైస్ మిల్లర్ల ఇండ్లలో .. ఐటీ అధికారుల సోదాలు

సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నిమ్స్ దవాఖానలో సంజయ్ తమ వెంట ఉండి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. సంజయ్ తనకు సోదరుడు వంటివారని, సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, సర్పంచ్​ జంగిటి అంజయ్య,  ఎంపీపీ సాయి రెడ్డి, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.