కాంగ్రెస్‌‌ హామీలకు గ్యారంటీ లేదు : కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి, వెలుగు: కాంగ్రెస్‌‌ ఆరు గ్యారంటీలపై జనానికి నమ్మకం లేదని, బీజేపీ అభ్యర్థి మాటలకు  వారంటీ లేదని కోరుట్ల బీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి డాక్టర్‌‌ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. గురువారం మెట్‌‌పల్లి టౌన్‌‌, బండలింగాపూర్​గ్రామంలోని పలు కులసంఘాలు, యూనియన్లను కలిసి తనకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లు  రాగానే దొంగమాటలతో ఊర్లకు వచ్చే వాళ్లను నమ్మొద్దని, ఆ పార్టీల పగటి బిచ్చగాళ్లను పొలిమేరల దాకా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

తొమ్మిదన్నరేండ్లలో బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. సుమారు 50 ఏండ్లు అధికారంలో ఉన్న  కాంగ్రెస్‌‌ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఒక్కచాన్స్‌‌ ఇవ్వాలంటూ అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక  సీఎం కేసీఆర్‌‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో  అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.