ఎల్లూరు మునిగి నాలుగున్నరేండ్లు

ఎల్లూరు మునిగి నాలుగున్నరేండ్లు
  • పంప్ హౌస్ లో దెబ్బతిన్న 2 ​పంపులు, మోటార్లపై పట్టింపేదీ?
  •  రెస్ట్​ లేకుండా నడుస్తున్న మిగతా 3  పంపులు
  •  డిమాండ్​మేరకు లిఫ్ట్​ అవ్వని నీరు
  •  కల్వకుర్తి ఆయకట్టు రైతుల ఇబ్బందులు

నాగర్​కర్నూల్, వెలుగు: 4.30 లక్షల ఎకరాలకు సాగు నీరు,3 వేల గ్రామాలకు తాగు నీరందించే మహాత్మాగాంధీ (కల్వకుర్తి)  ఎత్తిపోతల పథకంలోని ఫస్ట్​లిఫ్ట్​ఎల్లూరు పంప్​హౌస్. ఇక్కడ 2020 అక్టోబర్​లో జరిగిన ప్రమాదంలో పంప్​హౌస్​ నీటమునిగి, 2  పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయి. మిగతా 3 పంపులను ఏటా యాసంగి, వానాకాలం సీజన్లలో  రెస్ట్  లేకుండా నడిపిస్తున్నారు. బేస్​తో సహా పైకి లేచిన మూడో పంపు, లీకేజీ సమస్య ఉన్న ఐదో పంపును పూర్తిగా పక్కన పెట్టేశారు. 3 పంపులతో డిమాండ్​మేరకు నీటిని లిఫ్ట్​చేయలేకపోతున్నారు. ఈ యాసంగిలో మార్చి 31 వరకు మాత్రమే సాగు నీరిస్తామని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.  

2,400 క్యూసెక్కులకు కుదింపు

లిఫ్ట్​ఇరిగేషన్​లో పంపులు నడిపేందుకు నిర్దేశించిన గ్యారెంటీ హవర్స్​దాటిన తర్వాత వాటిని బంద్​పెట్టాలి. పంపులు, మోటార్ల నిర్వహణ, ల్యూబ్రికేషన్, గుర్తించిన ఇతర చిన్న రిపేర్లను చేసిన తర్వాతే తిరిగి నడిపించాలి. కానీ, ఇందుకు విరుద్ధంగా గ్యారెంటీ హవర్స్​ను పట్టించుకోకుండా నాలుగున్నరేండ్లుగా పంపులను నడిపిస్తున్నారు. 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాల్సిన ఉండగా  2,400 క్యూసెక్కులను కుదించారు. కేటాయించిన 40 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కేఎల్ఐ స్కీంలోని 28, 29, 30 ప్యాకేజీల కింద ఉన్న కాల్వలకు నీరందక పంట పొలాలు నెర్రెలుబారుతున్నాయి. టెయిల్​ఎండ్​పొలాల రైతులు నీటి రాకపై ఆశలు వదులుకున్నారు. 

సమీక్షలతోనే గడిపిన గత ప్రభుత్వం

ఎల్లూరు పంప్​హౌస్​ నీటమునిగి, 2 పంపులు పనికి రాకుండా పోతే గత ప్రభుత్వం సమీక్షలతోనే కాలం గడిపింది. ఆ తర్వాత, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ పంపులను బాగు చేయడానికి ప్రయత్నించినా ఎండాకాలంలో రెండు నెలల సమయమే ఉండటం, మిషన్​ భగీరథ స్కీంకు ఎల్లూరు పంప్​హౌస్​మోటార్లకు లింక్​ఉండటంతో వీలు కాలేదు. ఈ వేసవిలోనైనా పంప్​హౌస్​పై దృష్టి పెట్టాలన్న డిమాండ్​ పెరుగుతోంది.​ ప్రస్తుతం వర్కింగ్​కండీషన్​లో ఉన్న 3  పంపుల్లో ఒకదాన్ని  స్టాండ్​బై గా ఉంచి, 2 పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నారు. గతేడాది కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరదలు  వచ్చినా కల్వకుర్తి ఆయకట్టు రైతాంగానికి  40  టీఎంసీల నీటిని వినియోగించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న 4  రిజర్వాయర్ల ద్వారా సాగు నీరు, 3 వేల గ్రామాలు,19 మున్సిపాలిటీలకు మిషన్​భగీరథ తాగునీరు అందిస్తున్నారు. 

ప్రమాదం ఇప్పటికీ రహస్యమే..

ఎల్లూరు పంప్​హౌస్​ప్రమాదం ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయింది. ఈ ఘటనకు కారణాలేంటో తెలియదు. ఎంక్వైరీ చేయిస్తామన్న గత ప్రభుత్వం.. ఎస్ఎల్​బీసీ పవర్​హౌస్​యాక్సిడెంట్​మాదిరిగానే  పక్కన పెట్టింది. పూర్తిగా దెబ్బతిన్న మూడో పంపు, సర్జ్​పూల్, పంప్​హౌస్​మధ్య 50 మీటర్ల రాక్​లెడ్జర్ గోడ బీటలువారింది. లీకేజీ సమస్య తలెత్తడంతో ఐదో పంపును పూర్తిగా పక్కన పెట్టేశారు.

 రూ.15 కోట్లు అవసరం..

ఎల్లూరులో దెబ్బతిన్న పంపుల రిపేర్, హెడ్​ రెగ్యులేటరీ నిర్మాణానికి రూ.15 కోట్లు అవసరమవుతాయని ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​అంచనా వేస్తే..  గత ప్రభుత్వం నాలుగేండ్లలో రూ.4 కోట్లు కూడా విడుదల చేయలేదు. పంప్​హౌస్​నిర్వహణ ఒప్పందం చేసుకున్న పటేల్​కంపనీని తప్పించి, నచ్చిన వారికి ఇచ్చేశారు. పంపులను బాగు చేయిస్తే 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ రెండు సీజన్లలో 4.30 లక్షల ఎకరాలకు సాగునీటిని వినియోగించుకునే  అవకాశం ఉంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.