- 3.40 లక్షల ఎకరాలకు లబ్ధి
- యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్న సీఎం
- గ్రీన్ చానల్ ద్వారా నిధులిస్తం
- ప్రతి నెలా సమీక్ష చేయండి
- యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలి
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేసి నీరందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలలో రూ.396 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాలమూరు వర్సిటీ ఎస్టీపీ, అకడమిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్, మహబూబ్‌నగర్ రూరల్, గండీడ్ కేజీవీబీ భవన నిర్మాణాలకి శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3.40 లక్షల ఎకరాలకు నీరందించే ఈ జలాశయాన్ని పూర్తి చేసి బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి నెలా ప్రాజెక్టుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని సీఎం ఆదేశించారు. అలాగే సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు. సీఎం ఆదేశాలతో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా పరుగులు పెట్టనున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు.