- వరి, పత్తి సాగుకు ఆసరా
- త్వరలో కెనాల్స్‌కు నీటి విడుదల
నాగర్‌కర్నూల్, వెలుగు: వానాకాలం ప్రారంభంలో మురిపించిన వానలు.. ఆ తరువాత ముఖం చాటేయడంతో జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నీరులేక వాడిపోతున్నాయి. ఈ దశలో కల్వకుర్తి ఎత్తిపోతల రిజర్వాయర్లను నింపడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగు రోజులుగా శ్రీశైలం తిరుగు జలాలను ఎల్లూరు పంప్‌హౌజ్ నుంచి ఎత్తిపోస్తున్నారు. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లను నింపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉండడంతో కోతిగుండు సమీపంలోని ఎల్లూరు పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు.
ఎల్లూరు పంప్‌హౌజ్‌లో రెండు మోటార్ల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగోటం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి జొన్నలబొగడ నుంచి లిఫ్ట్ చేసి గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌కు నీటిని వదలారు. నాలుగు రిజర్వాయర్లలో 4.76 టీఎంసీల నీటిని నిల్వ చేసిన అధికారులు, కృష్ణా నదికి వరద ప్రారంభం కాగానే కాల్వల ద్వారా పొలాలకు నీటిని వదులుతామని చెబుతున్నారు.
భయపెట్టిన పెట్టుబడి వ్యయం..
జిల్లా రైతాంగం వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేశారు. దుక్కులు, విత్తనాలు, కూలీల చెల్లింపు కోసం బయటి నుంచి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. జూన్ నెలలో వేసిన పత్తి మొలకలు ఎదుగుదల లేక భూమి మీదే గిటకబారి పోయాయి. వరి నారు మడి దాటడం లేదని ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల భారీ వర్ష సూచన రైతుల్లో ఆశలు కల్పించినా.. జిల్లాలో అడపాదడపా కురిసిన ముసురుతో పెద్దగా ప్రయోజనం లేదని అంటున్నారు. జూన్, జులై నెలల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే నమోదైందన్న అధికారిక లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 20 మండలాల్లో నాలుగు మండలాల్లో మాత్రమే సగటు వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది. బోర్ల మీద ఆధారపడ్డ రైతులు కొంచెం ధైర్యంగా ఉన్నా వానల మీద ఆధారపడ్డ రైతులకు కేఎల్ఐ కింద రిజర్వాయర్లు నింపుతున్నారన్న సమాచారం ఊరట కలిగిస్తోంది.
పెరిగిన పత్తి సాగు..
జూన్ నెలలో కురిసిన వర్షాలతో నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ఏరియాల్లో భారీగా పత్తి సాగు చేశారు. కొల్లాపూర్ ఏరియాలో వరి, మొక్కజొన్న సాగు చేశారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 1.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు.10 వేల ఎకరాల్లో మొక్కజొన్న,4 వేల ఎకరాల్లో జొన్నలు సాగు చేయగా, వరి నాట్లు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల కింద వరి నారు పడలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నాలుగు రిజర్వాయర్లలోకి నీరు చేరడం, త్వరలో కాలువల ద్వారా నీరు అందిస్తామని చెబుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాల్వల రిపేర్లు లేనట్లే..
వర్షాకాలానికి ముందే కేఎల్ఐ ప్రాజెక్టులోని మూడు ప్యాకేజీల్లోని ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలను రిపేర్లు చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో పక్కన పెట్టారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్‌లో పంప్‌హౌజ్‌లు, కాల్వల నిర్మాణం, నిర్వాహణ,రిపేర్లు కాంట్రాక్టు ఏజెన్సీలే చేయాల్సి ఉంటుంది.మూడేండ్లుగా కేఎల్ఐ కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాల్వల నిర్వహణ, రిపేర్ల గురించి కాంట్రాక్టర్‌ను అడిగే పరిస్థితి లేకుండా పోయింది. కెనాల్స్ లో పూడిక, పిచ్చి మొక్కలు తొలగిస్తే చివరి ఆయకట్టు భూములకు నీరు పారే అవకాశం ఉందని అంటున్నారు.