- స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వెల్జాల్ గ్రామంలో ప్రచారం ముగించుకుని మిడ్జిల్ వైపు కారులో వస్తున్నారు. అదే టైంలో తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన పబ్బతి నరేశ్(25), పరుశురాములు(35) స్వగ్రామానికి బైకుపై వస్తున్నారు.
వెంకటాపూర్ శివారులోని రామాస్ పల్లి మైసమ్మ ఆలయం మూలమలుపు వద్ద ఎమ్మెల్యే కారు, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందగా..పరుశురాములు(35) తీవ్రంగా గాయపడ్డారు. కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ పరుశురాములును కల్వకుర్తి దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.