
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
నేడు శుక్రవారం (ఏప్రిల్ 18న) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ తో అంచనాలు పెంచిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ ఎలా ఉంది? కళ్యాణ్ రామ్ కి హిట్ పడిందా? తల్లీకొడుకుల అనుబంధం ఎలాంటి ఫీల్ ఇచ్చింది? వంటి అంశాలను పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. అర్జున్ విశ్వనాథ్ (కళ్యాణ్ రామ్) ఒక నిజాయితీ గల ఐపీఎస్ అధికారిణి వైజయంతి (విజయశాంతి) కుమారుడు. తన కొడుకు తనలాగే ఐపీఎస్ అధికారి కావాలని ఆమె కలలు కంటుంది.
ఈ క్రమంలో అర్జున్ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగిరావాల్సిన అర్జున్.. వెళ్లిన అయిదోరోజే తిరిగి వచ్చేస్తాడు. కారణం తన తండ్రి మరణం. నావీ అధికారి అయిన తన తండ్రి సముద్రంలో ప్రమాదవశత్తూ మరణించాడని పోలీసులు వెల్లడిస్తారు. నిజానికి అర్జున్ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు.. అదో హత్య.
ఇదే సమయంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఐపీఎస్ కావాల్సిన అర్జున్ గ్యాంగ్ స్టార్గా మారాల్సి వస్తోంది. తన కనుసైగలతో విశాఖపట్టణాన్ని శాసించే స్థాయికి వెళతాడు. దాంతో అతని తల్లి వైజయంతి అర్జున్‌ను తన జీవితం నుండి దూరం చేస్తుంది. ఈ క్రమంలో ముంబైలో కరుడుగట్టిన తీవ్రవాది మహమ్మద్ జియాయుద్దీన్ పఠాన్ (సోహెల్ ఖాన్) నుంచి వైజయంతికి ప్రాణహాని పొంచి ఉంటుంది. అప్పుడు తన తల్లికి ప్రాణహాని ఉందని తెలుసుకున్న అర్జున్ ఏం చేశాడు? డిసిపి ప్రకాశ్ (శ్రీకాంత్)కు వైజయంతికి ఉన్న సంబంధం ఏంటి..?
అసలు అర్జున్ తండ్రి ఎవరు? అతని హత్య చేసేందేవరు? ముంబైలో కరుడుగట్టిన తీవ్రవాది పఠాన్, ఐపీఎస్ వైజయంతిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అర్జున్ ఎందుకు నేరస్థుడిలా మారాల్సి వస్తోంది? విడిపోయిన తల్లీ కొడుకులు తిరిగి కలుస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ థియేటర్లలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఇది ఎమోషనల్ యాక్షన్ డ్రామా. తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకోవడం.. పోలీసు అవ్వాలనుకున్న హీరో, కష్టాల్లోవున్న జనాల కోసం గ్యాంగ్ స్టార్ గా మారడం వంటి కాన్సెప్ట్ పై కొన్ని సినిమాలొచ్చాయి. అయితే, ఈ సినిమాలో డ్రగ్స్‌ని, మాఫియాని లింక్ చేస్తూ దర్శకుడు ప్రదీప్ రాసుకున్న స్టోరీ ఆసక్తిగా ఉంది. వీటికితోడు ‘కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు’లా తల్లి కోసం కొడుకు పడే ఆరాటం, కష్టమోస్తే చేసే పోరాటం హృద్యంగా ఉంటుంది.
యాక్షన్ సీక్వెన్స్‌ని మాస్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసుకుని, డైరెక్టర్ ప్రదీప్ చక్కగా తెరకెక్కించాడు. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం రాసుకున్న సెంటిమెంట్ సీన్స్ కూడా సినిమాలు ప్రధాన బలంగా నిలిచాయి. అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బాగుంటే, సినిమా ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్, మదర్ సెంటిమెంట్, ఇంటర్వెల్ మెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది.
కథగా వెళితే..
సినిమా ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్‌లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ప్రదీప్. ఫస్ట్ హాఫ్ అంత ఎంగేజింగ్‌గానే ఉంటుంది. వైజయంతి కోణంలో తన కుమారుడి గురించి, ఎదురైన పరిస్థితుల గురించి ఒక్కొక్క విషయాన్ని చెప్పే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత తల్లి కొడుకుల మధ్య రిలేషన్, హీరో, విలన్‌కీ మధ్య యుద్ధం వంటి సీన్స్ తో వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండాఫ్ పై ఆసక్తి పెంచుతోంది.
సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక..వచ్చే కథ, స్క్రీన్ ప్లే రొటీన్ టెంప్లేట్‌తో సాగడం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, డైరెక్టర్ రాసుకున్న 20 నిమిషాల క్లైమాక్స్ పోర్షన్ సినిమాకు మెయిన్ హైలెట్గా నిలుస్తోంది. ప్రేక్షకులు ఉహించని విధంగా క్లైమాక్స్ రాసుకున్న తీరు కంటతడి పెట్టేంచేలా చేస్తోంది. ఈ తరహా క్లైమాక్స్ చేయడానికి హీరో కల్యాణ్‌రామ్ ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయం.
ఈ పర్టికులర్ పోర్షన్ లో కళ్యాణ్ రామ్- విజయశాంతిల నటన సినిమాకు ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. మొత్తానికి ఎమోషన్, యాక్షన్ సీన్స్ తో పాటుగా కొన్ని ట్విస్టులు తోడై ఉండుంటే అర్జున్ సన్నాఫ్ వైజయంతికి మరింత బలాన్ని చేకూర్చేది.
ఎవరెలా చేశారంటే:
అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ యాక్షన్ పార్ట్ లో అదరగొట్టారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో తన యాక్టింగ్ తో బాగా రాణించాడు. విజయశాంతి అద్భుతంగా నటించారు. ఈ పాత్రకు ఆమె తప్ప ఎవరూ చేసినా చూడలేరు అన్నట్టుగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.
భావోద్వేగ సన్నివేశాల్లో విజయశాంతి-కల్యాణ్‌రామ్ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా తమ పాత్రలకు జీవం పోశారు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్ర తక్కువే. విలన్ గా నటించిన సోహైల్‌ఖాన్ జస్ట్ ఒకే. నటుడు పృథ్వీ రాజ్,శ్రీకాంత్ నటన ఆకట్టుకుంటుంది.