
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. గుడ్ ఫ్రైడే రోజున (ఏప్రిల్ 18న) విడుదలైన ఈ సినిమాకు యావరేజ్‌గానే ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. తొలిరోజున రూ.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కల్యాణ్ రామ్ నటించిన లాస్ట్ మూవీ 'డెవిల్'.. సుమారుగా రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.4 నుంచి 4.5 కోట్లు వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో సుమారు రూ.2 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టినట్లు వెల్లడించారు. నేడు (ఏప్రిల్ 19న).. మేకర్స్ డే1 గ్రాస్ వసూళ్ల రిపోర్ట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
అయితే, ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఓపెనింగ్ దక్కించుకోలేదు. ఈ వీకెండ్లో దూసుకెళ్తే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవలే రిలీజైన ప్రియదర్శి కోర్ట్ మూవీ మొదటి రోజు రూ.4.15 కోట్లు వసూలు చేసింది. కోర్ట్ మూవీ దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ, భారీ బడ్జెట్తో వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి దానికంటే (₹4.15 కోట్లు) తక్కువ రావడం నిరాశ కలిగిస్తోంది.
మరి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' బడ్జెట్ ఎంత? సినిమాకు ఎంతొస్తే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది? సినిమా రిలీజ్ కు ముందు బిజినెస్ ఎంత చేసింది? అనే వివరాలు చూసుకుంటే.. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీకి సుమారుగా రూ.45 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే, టీజర్, ట్రైలర్ విజువల్స్ తో అంచనాలు పెంచడంతో సినిమా రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ చేసింది.
ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులు సుమారుగా రూ.18 కోట్లకు అమ్ముడయ్యాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ హక్కులు సుమారుగా రూ.4 కోట్ల మేరకు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 25 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.