కొత్త మండలాల్లో.. కల్యాణలక్ష్మికి లాగిన్​ కష్టాలు

  • రిజిస్ట్రేషన్​​ సేవలకు లాగిన్​ ఐడీ కేటాయింపు
  • కొత్తగా ఏర్పాటుచేసిన ఏడు మండలాల ఇవ్వని ప్రభుత్వం
  • ఇంకా పాత మండలాల నుంచే డౌన్లోడ్, అప్​లోడ్​
  • ఉన్నతాధికారులు చొరవ చూపితే సమస్యకు పరిష్కారం

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో 2019లో కొత్తగా ఏడు మండలాలను నాటి ప్రభుత్వం ఏర్పాటుచేసింది.  కామారెడ్డి జిల్లాలో  డొంగ్లి, పాల్వంచ, మహమ్మద్​నగర్, నిజామాబాద్​ జిల్లాలో పొతంగల్​, సాలుర, అలూర్, డొంకేశ్వర్​ఉన్నాయి.  కాగా రిజిస్ట్రేషన్​కోసం ప్రభుత్వం లాగిన్​ ఇచ్చి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​లకు ఇవ్వలేదు. దీంతో పాల్వంచ మండలానికి సంబంధించి సిబ్బంది కల్యాణలక్ష్మి లాగిన్​ కోసం పాత మండలం మాచారెడ్డికి,  డొంగ్లి సిబ్బంది మద్నూర్​కు,  మహమ్మద్​నగర్​ సిబ్బంది నిజాంసాగర్​కు వెళ్లాల్సి వస్తోంది.  దీంతో లబ్ధిదారుల ఎంపికలో మందకొడిగా సాగుతోంది. సేవల్లో జాప్యం నెలకొనకుండా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కామారెడ్డి, వెలుగు:   కొత్తగా ఏర్పడిన మండలాల్లో  కల్యాణలక్ష్మికి  లాగిన్​ సమస్య ఏర్పడింది.  ఈ మండలాలకు  సంబంధించి రెవెన్యూ కార్యకలాపాలు  కొనసాగుతున్నాయి.  భూముల రిజిస్ర్టేషన్ కోసం తహసీల్దార్లకు ప్రభుత్వం లాగిన్​ఐడీ ఇచ్చి,  కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​లకు  ఇవ్వలేదు.   కొత్త మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ల  స్కీం కోసం  దరఖాస్తు చేయడానికి వస్తే డౌన్​లోడ్, ఆప్​లోడ్ కు పాత మండలానికి ఇక్కడి సిబ్బంది వెళ్లాల్సివస్తోంది.  వెరిఫికేషన్​ తర్వాత పోర్టల్​లో అప్​లోడ్ కు కొంత జాప్యం జరుగుతోంది.  

పరిపాలన సౌలభ్యం పేరిట గత ప్రభుత్వం 2019లో  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాత కొత్తగా 32 మండలాలను  ఏర్పాటు చేసింది.  2022, 2023లో 7 మండలాలు ఏర్పడ్డాయి.   ఈ మండలాలను మండల పరిషత్తులుగా గుర్తిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది.  రెవెన్యూ శాఖకు  సిబ్బందిని  కేటాయించినా, మౌలిక వసతులు కల్పించలేదు.   రెవెన్యూ లావాదేవీలు కొత్త మండలాల ఆఫీసర్ల ద్వారానే  జరుగుతున్నాయి. 

మళ్లీ పాత మండలాలకు..

 కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ అప్లికేషన్లు క్లియర్​చేయటానికి కొత్త మండలాల ఆఫీసర్లకు లాగిన్​ ఇవ్వకపోవడంతో మళ్లీ పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. కాగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ స్కీంలో ప్రభుత్వం రూ.1,00,116 అందిస్తోంది.  వరుడు,  వధువు కుటుంబాల వివరాలు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మీసేవ ద్వారా అప్లయ్​చేసుకోవాలి.  అప్లికేషన్​ సంబంధిత తహసీల్దార్​ఆఫీసుకు వెళ్తుంది. లబ్ధిదారుడు అప్లయ్​చేసిన ఫామ్స్ తహసీల్దార్​ఆఫీసులో అందజేయాలి.

 ALSO READ : రూ.10 కోట్ల విలువైన వడ్లను దారి మళ్లించిన మిల్లర్.. యాదాద్రి జిల్లాలో ఘటన

 అప్లికేషన్​లో తెలిపిన వివరాలన్నీ వాస్తవమేనా?,  స్కీమ్​కు అర్హుడా? కాదా? అనే పక్రియను రెవెన్యూ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్​ చేయాల్సి ఉంటుంది.   ఆన్లైన్​లో వచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్​చేసుకోవాలి.  క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత తహసీల్దార్​​ఆఫీస్​ నుంచి ఫామ్స్​అన్ని మళ్లీ అప్​లోడ్​ చేసి ఆర్డీవో లాగిన్​కు పంపాలి.

 ఇక్కడ పరిశీలన తర్వాత సంబంధిత నియోజక వర్గ ఎమ్మెల్యే ఆమోదం తర్వాత లబ్ధిదారులకు అమౌంట్​మంజూరు చేస్తారు.   ఇక్కడే లాగిన్​  ఉంటే పరిశీలన తర్వాత వెంటనే ఆన్​లైన్​లో డాటా అప్​లోడ్​ చేయొచ్చు. దరఖాస్తులు ఎక్కువగా వస్తేనే వెళ్తున్నారు. స్థానిక కార్యాలయంలో ఇతర పనులు ఉంటే పాత మండలానికి వెళ్లడంతో జాప్యం జరుగుతోంది.  ఈ పరిస్థితుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ స్కీం లబ్ధిదారుల ఎంపిక కొత్త మండలాల్లో మందకొడిగా సాగుతోంది.